కొనసాగుతున్న ‘జీఎస్‌టీ’ కనకవర్షం!

2 Jun, 2022 05:38 IST|Sakshi

మేలో 44 శాతం అప్‌

రూ.1.41 లక్షల కోట్లుగా నమోదు

2017 జూలైలో ప్రారంభమైన తర్వాత ఇవి నాల్గవ భారీ వసూళ్లు

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) భారీ వసూళ్లు కొనసాగుతున్నాయి. 2022 మేలో 2021 ఇదే నెలతో పోల్చితే (రూ.97,821) వసూళ్లు 44% పెరిగి రూ.1,40,885 లక్షల కోట్లకు చేరాయి. అయితే ఆల్‌ టైమ్‌ రికార్డు ఏప్రిల్‌ రూ.1,67,540 కోట్లు, మార్చి రూ.1,42,095 కోట్లు, జనవరి  రూ. 1,40,986 కోట్లతో  పోల్చితే మే  వసూళ్లు తక్కువ. అంటే 2017 జూలై 1న ప్రారంభమై తర్వాత మేలో వసూళ్లు నాల్గవ అతిపెద్ద పరిమాణం. కాగా, ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో  ఫిబ్రవరిని (రూ.1,33,026 కోట్లు) మినహాయిస్తే, జీఎస్‌టీ రూ.1,40 లక్షల కోట్లను అధిగమించడం ఇది నాల్గవసారి.  

వేర్వేరుగా...
► మొత్తం వసూళ్లు రూ.1,40,885 కోట్లుకాగా,  సెంట్రల్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.25,036 కోట్లు.
► స్టేట్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.32,001 కోట్లు.  
► ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.73,345 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.37,469కోట్లుసహా).
► సెస్‌ రూ.10,502 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలయిన రూ.931 కోట్లుసహా).
► మే నెల గణాంకాలకు ప్రాతిపదిక అయిన ఏప్రిల్‌ నెల్లో నమోదయిన ఈ–వే బిల్లులు 7.4 కోట్లు.

ఎకానమీకి శుభ సంకేతం
గత మూడు నెలల్లో రూ. 1.4 లక్షల కోట్లకు పైగా జీఎస్‌టీ వసూళ్లు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి సంకేతం. స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌టీ) సంఖ్యలతో సహా ఇతర ఆర్థిక విభాగాల్లో రికవరీ పరిస్థితి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పటిష్ట ఆడిట్‌లు, ప్రభుత్వ చర్యలు పన్ను ఎగవేతల నిరోధానికి దోహదపడుతున్నాయి.
– ఎంఎస్‌ మణి, డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌

మరిన్ని వార్తలు