భారత్‌లో యాప్స్, గేమ్స్‌కి పెరిగిపోతున్న క్రేజ్‌!

19 Aug, 2022 07:36 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ యాప్స్, గేమ్స్‌కి డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో 2019తో పోలిస్తే 2021లో యాక్టివ్‌ నెలవారీ యూజర్ల సంఖ్య 200 శాతం పెరిగింది. గూగుల్‌ ప్లే పార్ట్‌నర్‌షిప్స్‌ డైరెక్టర్‌ ఆదిత్య స్వామి ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాలు వెల్లడించారు.

గూగుల్‌ ప్లేలో వినియోగదారులు చేసే వ్యయాలు 2019తో పోలిస్తే 2021లో 80 శాతం పెరిగినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా విద్య, చెల్లింపులు, వైద్యం, వినోదం, గేమింగ్‌ వంటి విభాగాల్లోని యాప్‌ల వినియోగం గణనీయంగా వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. అలాగే గేమింగ్‌కు కూడా ఆదరణ పెరిగిందన్నారు. లూడో కింగ్‌ వంటి గేమ్స్‌ తొలిసారిగా 50 కోట్ల పైచిలుకు డౌన్‌లోడ్స్‌ నమోదు చేసుకున్నాయని స్వామి వివరించారు.  

‘గూగుల్‌ ప్లేలో భారతీయ యాప్‌లు, గేమ్‌ల విషయంలో నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 2019తో పోలిస్తే 2021లో 200 శాతం, చేసే వ్యయాలు 80 శాతం పెరిగాయి. అలాగే దేశీ యాప్‌లు, గేమ్‌లపై విదేశాల్లోని యూజర్లు వెచ్చించే సమయం 150 శాతం పెరిగింది‘ అని స్వామి వివరించారు. భారత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించిన కంపెనీల్లో ఎక్కువ భాగం వాటా ఈ తరహా యాప్‌ సంస్థలదేనని ఆయన పేర్కొన్నారు. గూగుల్‌ ప్లే భారత్‌లో వివిధ కేటగిరీల్లో అద్భుతమైన యాప్‌ల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇక్కడి డెవలపర్లు, స్టార్టప్‌ల వ్యవస్థ ఎంతగానో తోడ్పడిందని స్వామి వివరించారు.    

మరిన్ని వార్తలు