గూగుల్‌ విధానాలు .. భారత ఎకానమీకి హానికరం

26 Dec, 2022 05:40 IST|Sakshi

మ్యాప్‌మైఇండియా సీఈవో వర్మ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశీ పోటీదారులను అణగదొక్కేలా టెక్‌ దిగ్గజం గూగుల్‌ పాటిస్తున్న పోటీ వ్యతిరేక విధానా లు భారత వినియోగదారులు, ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నాయని మ్యాప్‌మైఇండియా సీఈవో, ఈడీ రోహన్‌ వర్మ వ్యాఖ్యానించారు. ‘గూగుల్‌ పోటీ వ్యతిరేక విధానాల ద్వారా కొత్త మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తుందని, తయారీ సంస్థలు.. యూజర్లలో ప్రత్యామ్నాయ ఆపరేటింగ్‌ సిస్ట మ్స్, యాప్‌ స్టోర్స్, యాప్స్‌ విస్తరణను అసాధ్యం చేస్తుందని పరిశ్రమ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలకు.. ఈ వ్యవహారాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన వారందరికీ తెలుసు. గూగుల్‌ పోటీ వ్యతిరేక విధానాలనేవి మ్యాప్‌మైఇండియా వంటి స్వదేశీ పోటీ సంస్థలను గొంతు నొక్కడం ద్వారా భారతీ య వినియోగదారులు, ఎకానమీకి చేటు చేస్తాయి‘ అని వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌లకు సంబంధించి గుత్తాధిపత్యం చలాయిస్తోందంటూ సీసీఐ రూ. 1,338 కో ట్ల జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ, ఎన్‌సీఎల్‌ఏటీని గూగుల్‌ ఆశ్రయించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ), ప్రభుత్వం, పార్లమెంటు తీసుకుంటున్న అద్భుతమైన చర్యలు అమలు కాకుండా నిరోధించేందుకు, తనకు అనుకూలంగా వ్యవహరించేలా అందర్నీ ప్రభావితం చేసేందుకు, ఒత్తిడి తెచ్చేందుకు గూగుల్‌ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వర్మ చెప్పారు. 2020లో కోవిడ్‌ విజృంభించినప్పుడు మ్యాప్‌మైఇండియా యాప్‌ కోవిడ్‌ కంటైన్‌మెంట్‌ జోన్లు, టెస్టింగ్‌.. ట్రీట్‌మెంట్‌ సెంటర్లు మొదలైన వివరాలన్నీ అందించేదని, గూగుల్‌ మ్యాప్స్‌లో ఇవేవీ ఉండేవి కావని వర్మ చెప్పారు. అలాంటి తమ యాప్‌ను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించిందని, అనేకానేక ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత గానీ పునరుద్ధరించలేదని వివరించారు. మరోవైపు, సీసీఐ ఆదేశాలతో భారతీయ యూజర్లు, వ్యాపారవర్గాలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే తాము ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీలు చేసినట్లు గూగుల్‌ ప్రతినిధి తెలిపారు.

మరిన్ని వార్తలు