Google: గూగుల్‌ చరిత్రలో మరో అతి పెద్ద డీల్‌..! మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌కు పోటీగా..!

8 Mar, 2022 20:43 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం అల్ఫాబెట్‌ ఇంక్‌కు చెందిన గూగుల్‌ మరో అతి పెద్ద భారీ డీల్‌ను కుదుర్చుకొనుంది. ఇది కంపెనీ చరిత్రలో రెండో అతిపెద్ద డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. 

మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ కంపెనీలకు పోటీగా..!
గూగుల్‌ సమీప టెక్‌ ప్రత్యర్థులు మైక్రోసాఫ్ట్ , అమెజాన్ కంపెనీలు క్లౌడ్‌ రంగంలో అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగంలో వీటికి  గట్టిపోటీను అందించేందుకుగాను సైబర్ సెక్యూరిటీ సంస్థ మాండియంట్ ఇంక్‌ను గూగుల్ కొనుగోలుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ విలువ సుమారు 5.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. గూగుల్‌ చరిత్రలో ఇది రెండో అతి పెద్ద డీల్‌గా నిలవనుంది. 2011లో మోటోరోలా మొబిలిటీను సుమారు 12.5 బిలియన్‌ డాలర్లతో గూగుల్‌ కైవసం చేసుకుంది. 

మరింత వేగంగా..!
మాండియంట్ ఇంక్‌ కొనుగోలుతో గూగుల్‌ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం మరింత మెరుగుపడనుంది. ఈ ఒప్పందంతో గూగుల్‌ ఈ రంగంలో ఏడాదిగాను 19 బిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించనుంది. మరోవైపు పలు  నివేదికల ప్రకారం...మైక్రోసాఫ్ట్ కార్ప్ కూడా మాండియంట్ ఇంక్‌ కంపెనీ కొనుగోలుపై దృష్టి సారిస్తోందని తెలుస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ దిగ్గజం వచ్చే ఐదేళ్లలో సైబర్‌ సెక్యూరిటీ కోసం 20 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు గతంలో అంచనా వేసింది. గూగుల్‌తో మాండియంట్‌ ఇంక్‌ ఒప్పందం జరుగుతుందనే ఊహగానాలతో మంగళవారం ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో మాండియంట్ షేర్లు 2శాతం క్షీణించగా, ఆల్ఫాబెట్ షేర్లు 0.2 శాతం పెరిగి 2532.20 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఒప్పందం ముగియనున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు.!

మరిన్ని వార్తలు