సుందర్‌ పిచాయ్‌.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ

18 Mar, 2023 13:47 IST|Sakshi

తమకు న్యాయం చేయాలని కోరుతూ గూగుల్‌ తొలగించిన ఉద్యోగులు ఏకంగా సీఈవో సుందర్‌ పిచాయ్‌కే బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై దాదాపు 1,400 మంది ఉద్యోగులు సంతకాలు చేయడం గమనార్హం. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లేఆఫ్ ప్రక్రియలో భాగంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్‌!

పలు డిమాండ్లు:

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు రాసిన ఈ బహిరంగ లేఖలో ఉద్యోగులు పలు డిమాండ్లు చేశారు. కొత్త నియామకాలను స్తంభింపజేయడం, నిర్బంధంగా తొలగించడం కాకుండా ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకునేలా కోరడం, కొత్త నియామకాల్లో తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్ణీత వ్యవధి వరకూ ఉద్యోగులను తొలగించకుండా కొనసాగించడం వంటి డిమాండ్లను సీఈవో ముందు ఉంచారు. సంక్షోభాలతో సతమతమవుతున్న ఉక్రెయిన్ వంటి దేశాలకు చెందిన ఉద్యోగులను ఉద్వాసన నుంచి మినహాయించాలని కోరారు. అలాగే ఉద్యోగ తొలగింపు వల్ల వీసా లింక్డ్ రెసిడెన్సీని కోల్పోయే ప్రమాదం ఉన్నవారిని ఆదుకోవాలని అభ్యర్థించారు.

ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ..  పిజ్జాల కోసం డామినోస్‌ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా?

అయితే ఈ బహిరంగ లేఖపై ఆల్ఫాబెట్ ప్రతినిధి స్పందించలేదు. గత జనవరిలో సీఈవో సుందర్‌ పిచాయ్ ఉద్యోగాల కోతలను ప్రకటించినప్పుడు ముందెన్నడూ లేని కష్టతరమైన ఆర్థిక పరిస్థతిని ఎదుర్కొంటున్నామని, దీనికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

లేఖ వెనుక యూనియన్లు:

ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ టెక్ అండ్‌ అలైడ్ వర్కర్స్, యూఎన్‌ఐ గ్లోబల్‌తో సహా పలు యూనియన్‌లు ఈ బహిరంగ లేఖ వెనుక ఉన్నాయి. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో పిచాయ్‌కి భౌతికంగా లేఖను అందించడానికి కొన్ని రోజుల ముందే ఈ లేఖను సర్క్యులేట్‌ చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు