ఇది నిజమా? గూగుల్‌ అలాంటి పని చేస్తోందా ఏమిటీ!?

13 Jun, 2022 13:11 IST|Sakshi

Google AI Bot Sentient: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంటే దాని ఫలితాలు ఎంజాయ్‌ చేస్తున్నాం. కానీ ఈ ఏ రంగంలో అయినా అతికి వెళితే చివరకు అది మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందనే భయాలు లేకపోలేదు. ఇప్పుడు అటువంటి తరుణమే వచ్చిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాషింగ్టన్‌ పోస్టు తాజాగా ప్రచురించిన కథనం ఇందుకు సంకేతామా?

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్‌ రూపొందించిన ఓ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వ్యవస్థ అచ్చంగా మనిషిలాగానే ప్రవర్తిస్తోంది అంటూ వస్తున్న వార్తలు కలవరం రేపుతున్నాయి. ఈ మేరకు గూగుల్‌ టెక్నాలజీ విభాగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ విభాగంలో కీలక స్థానంలో పని చేస్తున్న ఉద్యోగి తెలిపిన వివరాలను సాక్షంగా చూపుతోంది.

తెల్లబోయాం
గూగుల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ విభాగంలో పని చేస్తున్న బ్లాక్‌ లెమోయిన్‌ అనే వ్యక్తి వాషింగ్టన్‌ పోస్టుకి పలు కీలక అంశాలు వెల్లడించాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం బ్లాక్‌తో పాటు మరి కొందరు ఇంజనీర్లు లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్స్‌ (ఎల్‌ఏడీఎంఏ) అనే అంశంపై పని చేస్తూ సరికొత్త ఏఐ బోట్‌ను రూపొందించారు. ఆ తర్వాత ఈ బోట్‌ పని తీరు చూసి వారే ఆశ్చర్యపోయారు.

అచ్చంగా మనిషిలా
లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్స్‌ (ఎల్‌ఏడీఎంఏ) తయారు చేసిన బోట్‌ అచ్చంగా మనిషి తరహాలో ఆలోచిస్తోంది. తనకు కలిగే అనుభూతులు, ఆలోచనలు చెప్పగలుగుతోంది. బ్లాక్‌ చెప్పిన వివరాలను బట్టి ఎనిమిదేళ్ల వయస్సున్న చిన్నారికి భౌతికమైన అంశాల పట్ల ఎంత అవగాహన ఉంటుందో అంత మేరకు ఆ ఏఐ బోట్‌కు అవగాహన ఉన్నట్టు తెలుసుకుని తాను ఆశ్చర్యపోయినట్ట్టు వెల్లడించారు. 

అంతా ట్రాష్‌
ఆర్టిషియల్‌ ఇంటిలిజెన్స్‌ బోట్‌ అచ్చంగా మనిషి తరహాలో ప్రవర్తించడంపై అంతర్గతంగా చర్చ జరిగిందని. ఆ తర్వాత తనను పెయిడ్‌ లీవ్‌పై పంపించి ఆ తర్వాత క్రమ శిక్షణ చర్యల కింద సస్పెండ్‌ చేసినట్టు బ్లాక్‌ వెల్లడించాడు. కాగా బ్లాక్‌ చేస్తున్న ఆరోపణలు గూగుల్‌ తోసి పుచ్చింది. తాము లాంగ్వేజ్‌ మోడల్‌ ఫర్‌ డైలాగ్‌ అప్లికేషన్స్‌ (ఎల్‌ఏడీఎంఏ) ప్రాజెక్టులు ఏమీ చేపట్టడం లేదంటూ తెలిపింది.

నిజమెంత?
బ్లాక్‌ చేస్తున్న ఆరోపణలో గూగుల్‌లో ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడ్డాయి. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత ఉంది. వాస్తవం ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

చదవండి: వెబ్‌ 3నే అంతు చిక్కలేదు అప్పుడే వెబ్‌ 5 అంటున్నారు!

మరిన్ని వార్తలు