గూగుల్‌ది ఆధిపత్య దుర్వినియోగమే

18 Mar, 2023 02:15 IST|Sakshi

ఎన్‌సీఎల్‌ఏటీలో సీసీఐ వాదనలు

న్యూఢిల్లీ: టెక్‌ సంస్థ గూగుల్‌ .. డిజిటల్‌ డేటాపరమైన పెత్తనం సాగిస్తోందని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆరోపించింది. కంపెనీ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని స్పష్టం చేసింది. గూగుల్‌పై జరిమానా విధించిన కేసుకు సంబంధించి నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో సీసీఐ ఈ మేరకు తన వాదనలు వినిపించింది. భారీగా ఆదాయం తెచ్చిపెడుతున్న సెర్చి ఇంజిన్‌ను గూగుల్‌ ఒక ’కోట’లాగా మార్చుకుందని, దానికి రక్షణగా చిన్న చితకా యాప్‌లను ఒక ’అగడ్త’లాగా ఉపయోగించుకుంటోందని పేర్కొంది. సెర్చి ఇంజిన్‌ ద్వారా సేకరించే డేటాను తన గుప్పిట్లో ఉంచుకుని ఇతరత్రా పోటీ సంస్థలపై ఆధిపత్యం చలాయిస్తోందని సీసీఐ తెలిపింది.

డేటా సేకరణ, డేటా వినియోగాన్ని దుర్వినియోగం చేసి, ప్రకటనలపరమైన ఆదాయార్జన కోసం వాడుకుంటోందని పేర్కొంది. ప్రత్యామ్నాయం ఉండాలనేది సీసీఐ సూత్రం కాగా .. గూగుల్‌ పెత్తనం వల్ల ప్రత్యామ్నాయం, పోటీ లేకుండా పోతోందని ఆరోపించింది. ఇలాంటి ధోరణులను అరికట్టేందుకు సీసీఐ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం వల్ల మార్కెట్లో సంస్థలన్నింటికీ మరింత స్వేచ్ఛగా పోటీపడేందుకు అవకాశం లభించగలదని పేర్కొంది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ పరికరాల్లో పోటీని దెబ్బతీసే విధానాలు పాటిస్తోందంటూ గూగుల్‌కు సీసీఐ గతేడాది అక్టోబర్‌ 20న రూ. 1,338 కోట్ల జరిమానా విధించింది. దీన్ని ఎన్‌సీఎల్‌ఏటీలో గూగుల్‌ సవాలు చేసింది. మార్చి 31లోగా దీన్ని తేల్చాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఫిబ్రవరి 15 నుంచి ఎన్‌సీఎల్‌ఏటీ విచారణ ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు