ఎయిర్‌టెల్‌లో గూగుల్‌కు చోటు

29 Jan, 2022 05:28 IST|Sakshi

1 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌

1.28 శాతం వాటా కొనుగోలు

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా దేశీ టెలికం భారతి ఎయిర్‌టెల్‌లో దాదాపు 1 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇందులో భాగంగా సుమారు 700 మిలియన్‌ డాలర్లతో 1.28 శాతం వాటాలు కొనుగోలు చేయనుండగా, మిగతా 300 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని రాబోయే సంవత్సరాల్లో సర్వీసుల విస్తరణపై వెచ్చించనుంది. షేరు ఒక్కింటికి రూ. 734 రేటు చొప్పున గూగుల్‌ తమ సంస్థలో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

దాదాపు రూ. 5,224.3 కోట్ల (సుమారు 700 మిలియన్‌ డాలర్లు) విలువ చేసే 7,11,76,839 ఈక్విటీ షేర్లను గూగుల్‌కు కేటాయించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. కొత్త ఉత్పత్తులతో భారత్‌ డిజిటల్‌ లక్ష్యాల సాకారానికి రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ తెలిపారు. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లు సిద్ధంగా ఉన్న తమ నెట్‌వర్క్, డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు, చెల్లింపుల వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడగలవని ఆయన వివరించారు.

కంపెనీలు డిజిటల్‌ బాట పట్టడంలో తోడ్పడేందుకు, స్మార్ట్‌ఫోన్లు.. కనెక్టివిటీని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు ఎయిర్‌టెల్‌తో ఒప్పందం దోహదపడగలదని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా ఇరు సంస్థలు భారత్‌ కోసం ప్రత్యేకమైన 5జీ సొల్యూషన్స్‌ను కనుగొనడంపై కృషి చేయనున్నాయి. ఎయిర్‌టెల్‌ తన 5జీ ప్రణాళికలను మరింత దూకుడుగా అమలు చేసేందుకు, మార్కెట్‌ దిగ్గజం జియోకి దీటుగా పోటీనిచ్చేందుకు గూగుల్‌ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి. 1.28 శాతం వాటాల కోసం గూగుల్‌ చేస్తున్న 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ప్రకారం ఎయిర్‌టెల్‌ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లుగా (54.7 బిలియన్‌ డాలర్లు) ఉండనుంది.

ఇప్పటికే జియోలో గూగుల్‌...
దేశీయంగా డిజిటలీకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న గూగుల్‌ .. రాబోయే 5–7 ఏళ్లలో భారత్‌లో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 2020 జూలైలో జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపు 4.5 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 7.73 శాతం వాటాలు కూడా కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడుల ప్రకారం అప్పట్లో జియో ప్లాట్‌ఫామ్స్‌ విలువను రూ. 4.36 లక్షల కోట్లుగా (దాదాపు 58.1 బిలియన్‌ డాలర్లు) లెక్కగట్టారు.  
శుక్రవారం బీఎస్‌లో భారతి ఎయిర్‌టెల్‌ షేరు 1 శాతం పైగా పెరిగి రూ. 716 వద్ద క్లోజయ్యింది.   
 

మరిన్ని వార్తలు