భారత మార్కెట్లో న్యూస్‌ షోకేస్‌ ఫీచర్‌.. 30 సంస్థలతో జట్టు

19 May, 2021 09:07 IST|Sakshi

భారత్‌లో గూగుల్‌ న్యూస్‌ షోకేస్‌ డిజిటల్‌ నైపుణ్యాలపై విలేకరులు, విద్యార్థులకు శిక్షణ

30 వార్తా సంస్థలతో జట్టు

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా భారత మార్కెట్లో న్యూస్‌ షోకేస్‌ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. దీనికోసం 30 వార్తా సంస్థలతో జట్టు కట్టినట్లు వివరించింది. వీటిలో జాతీయ, ప్రాంతీయ, స్థానిక వార్తా సంస్థలు కూడా ఉన్నాయి. గూగుల్‌కి చెందిన న్యూస్, డిస్కవర్‌ ప్లాట్‌ఫాంలలో అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను పొందుపర్చేందుకు, ప్రచురణకర్తలకు తోడ్పాటు అందించేందుకు ఇది ఉపయోగపడగలదని గూగుల్‌ వివరించింది. తొలుత ఇంగ్లిష్, హిందీకి సంబంధించి ప్రత్యేక ప్యానెల్స్‌ ఉంటాయని, క్రమంగా ఇతర ప్రాంతీయ భాషల ప్యానెల్స్‌ అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.  

మరోవైపు, న్యూస్‌రూమ్‌లు, జర్నలిజం స్కూళ్లలో విలేకరులు, జర్నలిజం విద్యార్థులకు డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది దీన్ని ప్రారంభించిన తర్వాత నుంచి 100 పైచిలుకు వార్తా సంస్థల్లో సిబ్బందికి శిక్షణనిచ్చినట్లు, వచ్చే మూడేళ్లలో 50,000 మందికి శిక్షణ కల్పించనున్నట్లు సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ (ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌) బ్రాడ్‌ బెండర్‌ తెలిపారు.

అదే విధంగా.. కోవిడ్‌ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో విశ్వసనీయమైన వార్తలతో ప్రజలకు మరింత చేరువవడంలో ప్రచురణకర్తలకు న్యూస్‌ షోకేస్‌ తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయా వార్తల గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారిని షోకేస్‌ .. సదరు వార్తాసంస్థల సైటుకు మళ్లిస్తుందని వివరించారు. తద్వారా పాఠకులతో వార్తా సంస్థల సంబంధం కూడా మెరుగుపడగలదని బెండర్‌ చెప్పారు. న్యూస్‌ షోకేస్‌ ప్రస్తుతం డజను పైగా దేశాల్లో 700 పైచిలుకు వార్తా సంస్థలతో జట్టు కట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి నెలా గూగుల్‌ ద్వారా న్యూస్‌ వెబ్‌సైట్లకు 2,400 కోట్ల పైచిలుకు విజిట్స్‌ నమోదవుతుంటాయని పేర్కొన్నారు. 

చదవండి: GVK Biosciences: గోల్డ్‌మన్‌ శాక్స్‌తో రూ. 7,300 కోట్ల డీల్‌!

మరిన్ని వార్తలు