20 ఏళ్లుగా పరారీలో డాన్‌.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు

6 Jan, 2022 13:44 IST|Sakshi

టెక్నాలజీ.. ఆక్సిజన్‌ తర్వాత మనిషికి అవసరంగా మారింది. అయితే మనిషి తన కంఫర్ట్‌ లెవల్స్‌ పెరిగే కొద్దీ.. టెక్నాలజీని అప్‌డేట్‌ చేసుకుంటూ పోతున్నాడు. ఆపత్కాలంలో మనుషుల ప్రాణాల్ని కాపాడడమే కాదు.. అవసరమైతే సంఘవిద్రోహ శక్తుల వేటలోనూ సాయం చేస్తోంది సాంకేతిక పరిజ్ఞానం. ఇందుకు ఉదాహరణే.. ఇటలీలో జరిగిన ఓ ఘటన.


పోలీసుల్ని సైతం ముప్పుతిప్పలు పెట్టిన కరడు గట్టిన నేరస్తుణ్ని 20 ఏళ్ల తర్వాత టెక్నాలజీ పట్టించింది. ఇటలీ రాజధాని రోమ్‌లో 'స్టిడా' అనే సిసిలియన్ మాఫియా ఉంది. 2002 -03 మధ్య కాలంలో ఈ మాఫియా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కటకటాల వెనక్కి నెట్టారు. అయితే జైలు శిక్షను అనుభవిస్తున్న మాఫియా డాన్‌ గియోఅచినో గామినో (61) రోమ్ రెబిబ్బియా జైలు నుండి తప్పించుకున్నాడు. 

అక్కడి నుంచి నుంచి తప్పించుకుని మారు పేర్లు.. రకరకాల వేషాలతో కాలం గడిపాడు. గామినో పరారై 20ఏళ్లు గడిచినా.. ఇటలీ పోలీసులకు కంటిమీద కునుకు లేదు. ఈ నేపథ్యంలో చివరి అస్త్రంగా టెక్నాలజీని వాడాలనే బుద్ధి పోలీసులకు కలిగింది. ఇందుకోసం ఫోటోగ్రామ్‌ సాయం తీసుకుని..గామినో కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఫోటోగ్రామ్‌ ఫోటో సాయంతో గూగుల్‌ మ్యాప్‌ను అనుసంధానించారు. దేశవిదేశాల్ని జల్లెడపట్టారు.

చివరికి మాడ్రిడ్‌(స్పెయిన్‌) గల్లీలపై నిఘా వేయగా.. గాలాపగర్‌ అనే ప్రాంతంలో ఓ పండ్ల దుకాణం ముందు ఉన్న గామినోను గూగుల్‌ మ్యాప్‌ గుర్తించింది. వెంటనే ఇటలీ పోలీసులను అలర్ట్‌ చేసింది. అప్రమత్తమైన పోలీసులు గామినోను చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై ఇటాలియన్ యాంటీ-మాఫియా పోలీస్‌ యూనిట్ (డీఐఏ) డిప్యూటీ డైరెక్టర్ నికోలా అల్టీరో హర్షం వ్యక్తం చేశారు.  రెండు దశాబ్దాలపాటు ముప్పుతిప్పలు పెట్టిన ఓ మాఫియా డాన్‌ను గూగుల్‌ మ్యాప్‌ పట్టించడంపై సోషల్‌ మీడియాలోనూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడు ప్రస్తుతం స్పెయిన్‌  కస్టడీలో ఉన్నాడని, ఫిబ్రవరి చివరి నాటికి అతన్ని ఇటలీకి తరలిస్తారని సమాచారం.  

చదవండి: మనుషులు పట్టించుకోలేదు.. స్మార్ట్‌ వాచ్‌ బతికించింది

మరిన్ని వార్తలు