Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో టోల్‌ ఛార్జీల వివరాలు! ఆ ఫీచర్‌కు మాత్రం డబ్బులు!!

25 Aug, 2021 07:50 IST|Sakshi

టెక్నాలజీలో గూగుల్‌ మ్యాప్స్‌ నిజంగానే ఓ గేమ్‌ ఛేంజర్‌. గమ్యస్థానం చేరుకునేందుకు సరైన మార్గం కోసం కోట్ల మంది గూగుల్‌ మ్యాప్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఒక సెకనులో 70వేలమంది, గంటలకు 227 మిలియన్ల మంది.. ఒకరోజులో దాదాపు ఐదున్నర బిలియన్ల గూగుల్‌ యూజర్లు మ్యాప్స్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి యాప్‌ ఇప్పుడు రెండు ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్లు అందించింది. 

 
గూగుల్‌​ మ్యాప్‌.. ఓ ఆసక్తికరమైన ఫీచర్‌ను తీసుకురాబోతోంది. రహదారులపై టోల్‌ ఛార్జ్‌ వివరాల్ని యూజర్లకు ముందుగానే తెలియజేయబోతోంది. తద్వారా వాహనదారుడు ముందుగానే తన రూట్‌ను ఎంచుకునే  అవకాశం కలగనుంది. ప్రస్తుతం డెవలపింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను వీలైనంత త్వరలోనే గూగుల్‌ మ్యాప్‌ అందుబాటులోకి రానుంది. కొందరు వాహనదారులకు కొత్త రూట్‌లో ప్రయాణించినప్పుడు  రహదారి ఎలా ఉండబోతోంది? మధ్యలో ఎన్ని టోల్‌ గేట్స్‌ ఉన్నాయి? ఎంత వసూలు చేస్తారు? అనే వాటిపై ఒక ఐడియా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం గూగుల్‌ మ్యాప్‌ ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. 

అయితే దీనిపై గూగుల్‌ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా.. గూగుల్‌ మ్యాప్‌ ప్రివ్యూ ప్రోగ్రాం ఓ సందేశాన్ని పంపింది. చాలా దేశాల్లో వాజే మ్యాపింగ్‌ యాప్‌(ఇది కూడా గూగుల్‌ కిందే పని చేస్తోంది) ఇలాంటి ఫీచర్‌గా వాహనదారులకు ఉపయోగపడుతోంది. ఇక గూగుల్‌ మ్యాప్‌ టోల్‌ ట్యాక్స్‌ ధరలను ఎలా తెలియజేస్తుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా.. బహుశా టోల్‌ ఆపరేటర్లు ఫిక్స్‌ చేసే ధరల పట్టిక, రోడ్డు మార్గాలు తదితర వివరాల వెబ్‌సైట్‌ ఆధారంగా.. వాహనదారులకు తెలియజేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
 

చెల్లిస్తేనే.. ముందుకు వెళ్లేది!
గూగుల్‌ మ్యాప్‌లో బెస్ట్ ఫీచర్‌గా  ‘టర్న్‌ బై టర్న్‌’ నావిగేషన్‌కు పేరుంది. ముఖ్యంగా రూరల్‌ ఏరియాల్లో, ఇరుకు గల్లీల్లో, సిటీల్లో చాలామంది ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇది ఉపయోగించాలంటే ఇప్పుడు ఎంతో కొంత చెల్లించాల్సిందే. అవును.. ప్రస్తుతం ఈ ఫీచర్‌..  గూగుల్‌ క్రౌడ్‌ఫండింగ్‌ ఫీచర్‌ కిందకు వెళ్లిపోయింది. జీపీఎస్‌ లొకేషన్‌-నేవిగేషన్‌ను యూజర్‌కు అందించడం భారంగా మారుతున్న నేపథ్యంలోనే గూగుల్‌ మ్యాప్‌.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచే ఈ ఫీచర్‌ను మొదలుపెట్టింది గూగుల్‌ మ్యాప్‌(అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే!). అయితే మొత్తం గూగుల్‌ యాప్‌నే ‘పే అండ్‌ యూజ్‌’ కిందకు తీసుకురానుందా? అనే ప్రశ్నపై మాత్రం గూగుల్‌ మ్యాప్‌ మౌనం వహిస్తోంది.

చదవండి: కంటిచూపుతోనే ఇక ఫోన్‌ ఆపరేటింగ్‌!

మరిన్ని వార్తలు