ప్లేస్టోర్‌లో మళ్లీ ఫ్యాంటసీ గేమ్స్‌ యాప్స్‌

9 Sep, 2022 06:10 IST|Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద ఫ్యాంటసీ గేమింగ్, రమ్మీ గేమ్స్‌ యాప్స్‌ను గతంలో తమ ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన గూగుల్‌ .. కొన్ని ఎంపిక చేసిన యాప్స్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. ఏడాది పాటు పైలట్‌ ప్రాజెక్టు కింద వాటిని ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. 2022 సెప్టెంబర్‌ 28 నుంచి 2023 సెప్టెంబర్‌ 28 వరకూ పరిమిత కాలం పాటు భారత్‌లోని డెవలపర్లు రూపొందించిన డీఎఫ్‌ఎస్‌ (డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్‌), రమ్మీ యాప్స్‌ను దేశీయంగా యూజర్లకు అందించేందుకు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచున్నట్లు గూగుల్‌ తెలిపింది.

అయితే, ఎంపిక చేసిన కొన్నింటిని మాత్రమే ప్లేస్టోర్‌లో అనుమతించడమనేది పక్షపాత ధోరణి అని, ఆధిపత్య దుర్వినియోగమే అవుతుందని గేమింగ్‌ సంస్థ విన్‌జో వర్గాలు ఆరోపించాయి. మరోవైపు, ఈ పైలట్‌ ప్రోగ్రాం ద్వారా పరిస్థితులను అధ్యయనం చేసి, తగు విధమైన చర్యలు తీసుకోనున్నట్లు గూగుల్‌ ప్రతినిధి పేర్కొన్నారు. యువ జనాభా, ఇంటర్నెట్‌ .. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా గేమింగ్‌ పరిశ్రమ వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ (పీఎఫ్‌జీ) అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు