డిజిటల్‌ టోకెన్‌తో చెల్లింపులు

22 Sep, 2020 05:03 IST|Sakshi

గూగుల్‌ పే, వీసా భాగస్వామ్యం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ వాలెట్‌ ప్లాట్‌ఫాం, ఆన్‌లైన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ అయిన గూగుల్‌ పే, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ వీసా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అత్యంత భద్రతతో డిజిటల్‌ టోకెన్‌తో కూడిన డెబిట్, క్రెడిట్‌ కార్డు ఆధారిత చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్షంగా క్రెడిట్, డెబిట్‌ కార్డు వివరాలు ఇచ్చే అవసరం లేకుండానే గూగుల్‌ పే ఆన్‌డ్రాయిడ్‌ యూజర్లు ఈ డిజిటల్‌ టోకెన్‌తో చెల్లింపులు జరపవచ్చు.

నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) ఆధారిత పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టెర్మినల్‌తోపాటు ఆన్‌లైన్‌ లావాదేవీలూ దీని ఆధారంగా సులువుగా పూర్తి చేయవచ్చని కంపెనీ సోమవారం ప్రకటించింది. 3డీ సెక్యూర్‌ సైట్స్‌కు రీడైరెక్ట్‌ చేయకుండానే ఓటీపీతో ఈ–కామర్స్‌ లావాదేవీలు జరుపవచ్చు. ప్రస్తుతం యాక్సిస్, ఎస్‌బీఐ కార్డుదారులు ఈ సేవలు పొందవచ్చు. పెరుగుతున్న కస్టమర్లకు భద్రతతో కూడిన చెల్లింపులకు కట్టుబడి ఉన్నామని గూగుల్‌ పే బిజినెస్‌ హెడ్‌ సజిత్‌ శివానందన్‌ తెలిపారు. మోసాలకు తావు లేకుండా డిజిటల్‌ టోకెన్‌ సాయపడుతుందని, కార్డు వివరాలు ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం ఉండదని అన్నారు. గూగుల్‌ పే భాగస్వామ్యంతో తమ కస్టమర్లకు భద్రమైన, సౌకర్యవంతమైన చెల్లింపు విధానం అందించేందుకు వీలైందని ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ, సీఈవో అశ్విని కుమార్‌ తివారీ తెలిపారు.

మరిన్ని వార్తలు