జీపే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్ సంచలనం: మీ రివార్డ్స్‌ చెక్‌ చేసుకోండి!

10 Apr, 2023 11:37 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆన్‌లైన్‌ చెల్లింపుల సంస్థ గూగుల్‌ పే ద్వారా కొంతమంది వినియోగదారులకు మనీ క్రెడిట్‌ అవ్వడం సంచలనంగా మారింది. కొంతమంది  జీపే  వినియోగదారుల ఖాతాల్లో అనూహ్యంగా ఏకంగా రూ. 88,000 వరకు  జమ అవ్వడం కలకలం రేపింది.  అయితే కంపెనీ వెంటనే లోపాన్ని గుర్తించి, క్రెడిట్ చేసిన మొత్తాలను సాధ్యమైన చోట వెనక్కి తీసుకుందిట. ఈ వార్త గుప్పుమనడంతో చాలామంది తమ ఖాతాలో ఏంత జమ అయిందా అని తెగ వెదికేశారట. అయితే ఇది అమెరికాలో జరిగిన పరిణామం మాత్రమే. భారతీయ వినియోగదారులకు ఇలాంటి క్రెడిట్స్ కు ఏ రకమైన సంబంధం లేదని గూగుల్ తెలిపింది.

గూగుల్ పే  యూజర్లకు స్క్రాచ్ కార్డ్స్ ద్వారా మహా అయితే రూ. 6 క్యాష్‌బ్యాక్ రివార్డ్స్‌ రావడమే గొప్ప. సాధారణంగా బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైం అనే సందేశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటిది తాజాగా గూగుల్ పే యూజర్ల అకౌంట్లలోకి రూ.80 వేల వరకు ట్రాన్స్‌ఫర్ కావడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. గూగుల్ పే లో సాంకేతిక లోపం కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.  

ముఖ్యంగా "డాగ్‌ఫుడింగ్" అనే  ఫీచర్‌ పరీక్షిస్తున్న సమయంలో ఈ పొరబాటు దొర్లినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.  కంపెనీ కొత్త ఫీచర్‌ టెస్టింగ్‌ సందర్భంగా తమ ఉద్యోగులకు చెల్లించే బదులు అనుకోకుండా నగదును కొంతమంది యూజర్లకు  పంపించినట్టు సమాచారం. 

దీంతో పొరపాటున తమకు భారీగా డబ్బులు వచ్చినట్టు మిషాల్ రెహమాన్ అనే జర్నలిస్ట్  సహా  కొంతమంది రెడిట్‌ యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్కొక్కరికి 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు జమ అయిందట.అయితే  ఎంతమంది వినియోగదారుకు ఈ క్రెడిట్‌ లభించింది అనేది అస్పష్టం. అలాగే ఈ నగదు జమ గూగుల్‌ పిక్సెల్‌ వినియోగదారులకు పరిమితమైందా? లేక ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్లనుకూడా ప్రభావితం చేసిందా అనేది కూడా స్పష‍్టత లేదు.

ఈ విషయంలో కొంత మంది యూజర్లను మెయిల్‌ ద్వారా సంప్రదించింది గూగుల్‌. వీలైనంత సొమ్మును వెనక్కి తీసుకుంది. అంతేకాదు సంబంధిత క్రెడిట్‌ను యూజర్లు  వాడేసినా, వేరే ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేసేసినా, తాము  రివర్స్ చేయలేకపోతే, ఇక ఆ డబ్బు మీదే.. తదుపరి చర్యలు అవసరం లేదని కూడా గూగుల్‌ పేర్కొంది. మరోవైపు ఈ వ్యవహారంపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌  కూడా ‘నైస్‌’ అంటూ వ్యంగ్యంగా స్పందించడం విశేషం. 

మరిన్ని వార్తలు