రుణాల యాప్‌లపై గూగుల్‌ సంచలన నిర్ణయం

4 Feb, 2021 15:22 IST|Sakshi

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక కష్టాల సమయంలో రుణాలు ఇస్తామంటూ వెంటపడి ఇచ్చిన రుణ యాప్‌లు అనంతరం ఆ రుణాలు చెల్లించాలని తీవ్ర వేధింపులకు గురి చేసి పదుల సంఖ్యలో ప్రజలు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విధంగా రుణాలు ఇచ్చే యాప్‌లు ప్రజలను వేధిస్తున్నాయని పోలీసులతో పాటు ప్రజలు ఫిర్యాదులు చేయడంతో ఎట్టకేలకు గూగుల్‌ సంస్థ స్పందించింది. అలాంటి లోన్‌ యాప్స్‌ను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దాదాపు 100 యాప్‌లపై నిషేధం విధించింది.

డాటాను దుర్వినియోగం చేయడమే కాకుండా ఎక్కువ మొత్తం వడ్డీలు వసూలు చేస్తున్నారనే విషయాన్ని గూగుల్‌ గుర్తించి ఈ చర్యలు తీసుకుంది. ఆ యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది. వెంటనే రుణాలు ఇస్తామని ప్రజల వెంటపడి తర్వాత అధిక వడ్డీ పేరుతో వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. రుణాలు చెల్లించినా కూడా వడ్డీ పేరిట అధిక వసూళ్లకు పాల్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ల మోసాలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఈ యాప్‌ల ద్వారా రుణాలపై అధిక వడ్డీకి సంబంధించిన ఫిర్యాదులు చాలా వచ్చాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి సంజయ్ ధోత్రే లిఖితపూర్వక సమాధానంలో బుధవారం పార్లమెంటుకు తెలిపారు. వ్యక్తిగత డాటా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులను కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందని మంత్రి చెప్పారు.

ఈ క్రమంలోనే కొన్ని రుణాలకు సంబంధించిన యాప్‌లను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. తొలగించిన యాప్‌లు తమ నిబంధనలను పాటించడం లేదని, భద్రతా విధానాలను ఉల్లంఘించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు గూగుల్‌ వివరించింది. అయితే ఎన్ని యాప్స్‌.. వేటిని నిషేధించిందనే విషయం మాత్రం గూగుల్‌ బహిర్గతపర్చలేదు. మొత్తానికి కొన్ని రుణాల యాప్స్‌లను తొలగించడంతో కొంత ఊరట కలిగించే అంశమైనప్పటికీ ఇలాంటి రుణాలకు సంబంధించిన యాప్స్‌ ప్లే స్టేర్‌ వేలకొద్దీ ఉన్నాయని.. వాటిని కూడా నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు గూగుల్‌కు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.

అయితే యాప్‌లను నిషేధించడం.. ప్లే స్టోర్‌ నుంచి తొలగించడం కొత్త కాదు. గతంలో చైనాకు సంబంధించిన యాప్‌లు భారతదేశంలో నిషేధించారు. ప్రాణాంతకంగా మారడంతో పబ్జీ గేమ్‌ను కూడా నిషేధించిన విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు