వేధించే లోన్‌ యాప్స్‌ ఔట్‌

16 Jan, 2021 00:16 IST|Sakshi

వందలాది లోన్‌ యాప్స్‌ తొలగింపు!

నిబంధనలకు లోబడి ఉండాల్సిందే

సమాచారం లేకుండానే తొలగిస్తాం

డెవలపర్లను హెచ్చరించిన గూగుల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఆగడాలపై దేశవ్యాప్తంగా వేడివేడి చర్చ జరుగుతున్న వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ ఘాటుగా స్పందించింది. వినియోగదార్ల భద్రతా విధానాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తిగత రుణ యాప్‌లను ఆన్‌డ్రాయిడ్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించినట్టు వెల్లడించింది. కస్టమర్లు, ప్రభుత్వ సంస్థలతోపాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వందలాది యాప్స్‌ను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఆన్‌డ్రాయిడ్‌ సెక్యూరిటీ, పైవసీ ప్రొడక్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుజాన్నే ఫ్రే ఒక బ్లాగ్‌ పోస్ట్‌ ద్వారా తెలిపారు.

కస్టమర్లకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడమేగాక, వసూలు చేసేందుకు యాప్స్‌ ప్రతినిధులు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఎన్ని యాప్స్‌ను తొలగించారో గూగుల్‌ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. గత 10 రోజుల్లో సుమారు 120 యాప్స్‌ను తీసివేసినట్టు సమాచారం. ఇలా ప్లే స్టోర్‌ నుంచి గుడ్‌బై చెప్పిన యాప్స్‌ సంఖ్య డిసెంబర్‌ చివరి వారం నుంచి ఇప్పటి వరకు వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది.  

నోటీసు లేకుండానే..: స్థానిక చట్టాలు, ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఉన్నాయా లేవా అని నిరూపించాలని ఇతర గుర్తించిన యాప్‌ డెవలపర్లను గూగుల్‌ ఆదేశించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి పొందిన లైసెన్సు పత్రాలను తమ ముందు అయిదు రోజుల్లో ఉంచాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. గూగుల్‌ ప్లే డెవలపర్‌ డిస్ట్రిబ్యూషన్‌ అగ్రిమెంట్‌కు లోబడే డెవలపర్లు పనిచేయాల్సి ఉంటుందని సంస్థ గుర్తు చేసింది. విఫలమైన యాప్స్‌ను ముందస్తు నోటీసు లేకుండానే తొలగిస్తామని హెచ్చరించింది. ఆన్‌లైన్‌ రుణ వేధింపుల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. డిజిటల్‌ రుణాల క్రమబద్ధమైన వృద్ధిని ప్రోత్సహించడానికి, నియంత్రణ చర్యలను సూచించడానికి ఒక బృందాన్ని నియమించినట్టు ఆర్‌బీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న ఫిన్‌టెక్‌ యాప్స్‌పై కన్నేసి ఉంచాలన్న ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో గూగుల్‌ తాజా చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కీలక వివరాలు ఉండాల్సిందే..: వ్యక్తిగత రుణాలను అందిస్తున్న ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ యాప్స్‌.. రుణాలను తిరిగి చెల్లించాల్సిన కనీస, గరిష్ట కాల పరిమితి, గరిష్ట వార్షిక వడ్డీ శాతం, మొత్తం లోన్‌కు అయ్యే ఖర్చు వంటి కీలక వివరాలను ముందస్తుగా వెల్లడించాల్సిందేనని గూగుల్‌ స్పష్టం చేసింది. తద్వారా నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్లకు ఆస్కారం ఉంటుందని, మోసానికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది. రుణం జారీ చేసిన తేదీ నుండి 60 రోజులు, అంతకన్నా ఎక్కువ రోజుల్లో తిరిగి చెల్లించాల్సిన వ్యక్తిగత రుణ యాప్స్‌ను మాత్రమే గూగుల్‌ అనుమతిస్తుంది. డెవలపర్లు ప్రస్తుత సేవలను అమలు చేయడానికి అవసరమైన అనుమతులను మాత్రమే యూజర్ల నుంచి అభ్యర్థించాలి. వారు బహిర్గతం చేయని, అమలు చేయని, అనుమతించని ప్రయోజనాల కోసం వినియోగదారు లేదా వారి మొబైల్‌లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించరాదని హెచ్చరించింది.  

అనుమతి తీసుకోవాలి..
డెవలపర్లు వినియోగదారు అంగీకరించిన ప్రయోజనాల కోసం మాత్రమే డేటాను ఉపయోగించాలి. తరువాత వారు ఇతర ప్రయోజనాల కోసం డేటాను ఉపయోగించాలనుకుంటే, వారు అదనపు ఉపయోగాలకు వినియోగదారు అనుమతి పొందాలని గూగుల్‌ స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సహకరిస్తామని సంస్థ  తెలిపింది. ‘గూగుల్‌ ఉత్పత్తుల ద్వారా సురక్షిత, భద్రమైన అనుభవాన్ని కస్టమర్లకు అందించడం మా ప్రాధాన్యం. మా గ్లోబల్‌ ప్రొడక్ట్‌ పాలసీలు ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించి, అమలు చేయబడ్డాయి. వినియోగదార్ల భద్రతను పెంచడానికి మా పద్ధతులను మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము’ అని వివరించింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు