2 వేల లోన్‌ యాప్స్‌ తొలగింపు

26 Aug, 2022 06:30 IST|Sakshi

ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన కార్యక్రమాలు

గూగుల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం, వివాదాస్పద ఆఫ్‌లైన్‌ ధోరణులు తదితర అంశాల కారణంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఇండియా ప్లే స్టోర్‌ నుంచి 2,000 పైగా లోన్‌ యాప్స్‌ను తొలగించినట్లు టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సైకత్‌ మిత్రా తెలిపారు. రుణాల యాప్‌ల సమస్య ఇప్పటికే తారా స్థాయికి చేరుకుందని, దీనిపై అంతా దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఇది ఇకపై క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని మిత్రా వివరించారు.

రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేసే అంశాన్ని కూడా సంస్థ పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. లోన్‌ యాప్‌ల సమస్య ఒకో మార్కెట్లో ఒకో రకంగా ఉంటోందని మిత్రా తెలిపారు. అమెరికాలో పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన యాప్‌ల సమస్య ఉండగా.. భారత్‌లో తప్పుదోవ పట్టించే, నిబంధనలను ఉల్లంఘించడం రూపంలో యాప్‌ల సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. తాము కార్యకలాపాలు సాగించే అన్ని దేశాల్లోనూ నియంత్రణ నిబంధనలను పాటించడానికి కట్టుబడి ఉన్నామని మిత్రా స్పష్టం చేశారు.

సైబర్‌సెక్యూరిటీపై రోడ్‌షోలు..
ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన కల్పించే దిశగా భారత్‌లో వివిధ నగరాల్లో సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ గుప్తా తెలిపారు. 1,00,000 మంది డెవలపర్లకు శిక్షణ కల్పించనున్నట్లు, అలాగే డిజిటల్‌ భద్రతను ప్రోత్సహించే దిశగా వివిధ సంస్థలకు గూగుల్‌డాట్‌ఆర్గ్‌ 2 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లు) నిధులు గ్రాంట్‌గా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలెక్టివ్‌ గుడ్‌ ఫౌండేషన్, పాయింట్‌ ఆఫ్‌ వ్యూ, హెల్ప్‌ఏజ్‌ ఇండియా తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. సైబర్‌ ముప్పుల నుంచి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు గుప్తా వివరించారు. డిజిటల్‌ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించే క్రమంలో మెరుగైన విధానాలు పాటించేలా ఇంటర్నెట్‌ యూజర్లను ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాన్ని కూడా వివిధ భాషల్లో గూగుల్‌ ఆవిష్కరించింది. 

మరిన్ని వార్తలు