మహిళా సాధికారతకు గూగుల్‌ తోడ్పాటు

9 Mar, 2021 05:41 IST|Sakshi

25 మిలియన్‌ డాలర్ల గ్రాంటు 

న్యూఢిల్లీ: బాలికలు, మహిళల సాధికారత కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు 25 మిలియన్‌ డాలర్ల మేర గ్రాంటు ఇవ్వనున్నట్లు టెక్‌ దిగ్గజం గూగుల్‌లో భాగమైన గూగుల్‌డాట్‌ఓఆర్‌జీ వెల్లడించింది. లాభాపేక్ష లేకుండా నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు మొదలైనవి దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జాక్వెలిన్‌ ఫుల్లర్‌ తెలిపారు. ఎంపికయ్యే సంస్థలకు ఒకోదానికి దాదాపు 2 మిలియన్‌ డాలర్ల దాకా నిధులు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌లో తాము నిర్వహిస్తున్న ఇంటర్నెట్‌ సాథీ డిజిటల్‌ అక్షరాస్యత శిక్షణా కార్యక్రమంతో గణనీయ సంఖ్యలో మహిళలు లబ్ధి పొందినట్లు జాక్వెలిన్‌ వివరించారు.

గడిచిన కొన్నేళ్లుగా భారత్‌లో ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నవకల్పనల ఆవిష్కర్తలు, లాభాపేక్ష లేని సంస్థలకు తోడ్పాటు అందించేందుకు దాదాపు 40 మిలియన్‌ డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేశామని ఆమె వివరించారు. ఇంటర్నెట్‌ సాథీ ప్రోగ్రాం అనుభవాలతో ’ఉమెన్‌ విల్‌’ పేరిట వెబ్‌ ప్లాట్‌ఫాంని రూపొందించినట్లు గూగుల్‌ ఇండియా సీనియర్‌ కంట్రీ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ సప్నా చడ్ఢా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టైలరింగ్, బ్యూటీ సర్వీసులు, హోమ్‌ ట్యూషన్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మొదలైన హాబీలను ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకునే మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు దీని ద్వారా అందగలవని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు