వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి వాటా

9 Sep, 2022 04:21 IST|Sakshi

33 శాతం ఇచ్చేందుకు బోర్డు సై

రూ. 10 ముఖ విలువలో షేర్ల జారీ!

న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్‌ ఐడియా(వీఐఎల్‌)లో ప్రభుత్వం వాటా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. షేరు విలువ రూ. 10 లేదా ఆపై స్థిరత్వాన్ని సాధిస్తే వాటాను పొందనున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. వొడాఫోన్‌ ఐడియా బోర్డు రూ. 10 ముఖ విలువకే ప్రభుత్వానికి వాటాను ఆఫర్‌ చేసింది. ముఖ విలువకే షేర్లను పొందేందుకు సెబీ నిబంధనలు అనుమతిస్తాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. షేరు ధర రూ. 10 లేదా అపై స్థిరత్వాన్ని సాధించాక టెలికం శాఖ(డాట్‌) ఇందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 19 నుంచి షేరు రూ. 10 దిగువనే కదులుతోంది. తాజాగా  0.5% నీరసించి రూ. 9.70 వద్ద ముగిసింది.

జూలైలోనే...: వీఐఎల్‌లో ప్రభుత్వం వాటాను సొంతం చేసుకునేందుకు జూలైలోనే ఆర్థిక శాఖ ఆమోదించింది. రూ. 16,000 కోట్లమేర వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పుచేసి ప్రభుత్వానికి కేటాయించేందుకు వీఐఎల్‌ ఇప్పటికే నిర్ణయించుకుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభించనుంది. వెరసి వీఐఎల్‌లో ప్రమోటర్ల వాటా 74.99 శాతం నుంచి తగ్గి 50 శాతానికి పరిమితంకానుంది. ప్యాకేజీలో భాగంగా ఏజీఆర్‌ చెల్లింపులకు సంబంధించి వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు టెలికం కంపెనీలకు ప్రభుత్వం అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీకి జూన్‌ చివరికల్లా స్థూలంగా రూ. 1,99,080 కోట్ల రుణ భారముంది.

మరిన్ని వార్తలు