Cryptocurrency: క్రిప్టో ఇన్వెస్టర్లకు కేంద్రం డెడ్‌లైన్‌..! ఉల్లంఘిస్తే భారీ జరిమానా..!

7 Dec, 2021 17:03 IST|Sakshi

పార్లమెంట్‌లో క్రిప్టోకరెన్సీపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. బిల్లు వస్తోన్న నేపథ్యంలో...భారత్‌లోని క్రిప్టోకరెన్సీ హోల్డర్స్‌ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి  గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ ఒక నివేదికలో పేర్కొంది. 

ఆస్తులుగా పరిగణించే అవకాశం..!
ముఖ్యంగా క్రిప్టోకరెన్సీలను పర్యవేక్షించడానికి,  నియంత్రించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలను ఫైనాన్షియల్‌ ఆస్తులుగానే పరిగణించే అవకాశం ఉంది. ఇటీవల సర్క్యులేట్ చేయబడిన క్యాబినెట్ నోట్ ప్రకారం...క్రిప్టోకరెన్సీలకు బదులుగా బిల్లులో 'క్రిప్టో ఆస్తులు' అనే పదాన్ని చేర్చనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్బీఐ రిలీజ్‌ చేస్తోన్న డిజిటల్‌ కరెన్సీలకు, క్రిప్టో కరెన్సీలకు స్పష్టమైన వ్యత్యాసం ఉండనుంది. 

ఉల్లంఘిస్తే రూ. 20 కోట్ల జరిమానా..!
క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం తెస్తోన్న బిల్లును క్రిప్టో ఇన్వెస్టర్లు ఉల్లంఘిస్తే ఏకంగా రూ. 20 కోట్ల జరిమానా లేదా  1.5 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అంతేకాకుండా చిన్న పెట్టుబడిదారులను రక్షించడానికి క్రిప్టో ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి కనీస థ్రెషోల్డ్ లేదా పరిమితిని కేంద్రం సెట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్చువల్‌ కరెన్సీల ద్వారా జరిపే లావాదేవీలపై పన్నులను విధించే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. 

భారత్‌లో 641 శాతం మేర వృద్ధి..!
చైనాలిసిస్‌ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్‌ నిలిచింది. 

చదవండి: క్రిప్టోకరెన్సీ బిల్లు..! ఆర్థిక శాఖ కీలక వ్యాఖ్యలు..! 

మరిన్ని వార్తలు