ఇక చిన్న సంస్థలకూ రేటింగ్స్‌

29 Jun, 2021 01:33 IST|Sakshi

ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) పనితీరుకు సంబంధించి ఫైనాన్షియల్‌ రేటింగ్స్‌ ఇచ్చే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఉన్న చిన్న సంస్థల రుణ పరపతి విషయంలో బ్యాంకులు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. దీని రూపకల్పనకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. ఎంఎస్‌ఎంఈల కోసం ఇండియన్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.

వార్షిక టర్నోవరు, వస్తు..సేవల పన్ను రికార్డులు, ఆదాయపు పన్ను రికార్డులు, ఎగుమతులు, లాభదాయకత తదితర అంశాల ఆధారంగా రేటింగ్స్‌ వ్యవస్థ ఉండగలదని ఆయన పేర్కొన్నారు. చిన్న వ్యాపారాలకు అవసరమైన ప్రభుత్వ సర్వీసులన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా ఎంఎస్‌ఎంఈ శాఖ ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉందని గడ్కరీ చెప్పారు. వివిధ రకాల ఇంధనాలతో నడవగలిగే ఫ్లెక్సిబుల్‌ ఫ్యూయల్‌ వాహనాలు త్వరలో రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఇథనాల్‌ ఆధారిత ’ఫ్లెక్స్‌ ఇంజిన్ల’ తయారీకి సంబంధించి వచ్చే 3 నెలల్లో స్కీము ప్రకటించనున్నట్లు మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు