పీఎస్‌యూ వాటాల విక్రయంలో ముందుకే

18 Dec, 2020 03:01 IST|Sakshi

వర్ధమాన దేశాల్లో భారత్‌కే ఎఫ్‌డీఐ ప్రవాహమెక్కువ

బలమైన నిర్ణయాలకు వెనుకాడబోం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  

న్యూఢిల్లీ, కోల్‌కతా: కేబినెట్‌ ఆమోదించిన ప్రభుత్వరంగ సంస్థల్లో (సెంట్రల్‌ పీఎస్‌యూ) వాటాల విక్రయాన్ని మరింత ముందుకు తీసుకెళతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వర్ధమాన దేశాల్లో భారత్‌కే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం (ఎఫ్‌డీఐ) అధికంగా ఉందని గుర్తు చేస్తూ.. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, సంస్కరణలు చేపట్టగల సామర్థ్యాలు, స్థిరమైన ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అంశాలుగా పేర్కొన్నారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలోనూ పెద్ద కంపెనీల్లో కొన్నింటిలో వాటాలను విక్రయించాలన్నది మా ప్రయత్నం.

ఆసక్తి వ్యక్తీకరణలు అందాయి. తదుపరి దశ ఆరంభమవుతోంది. కేబినెట్‌ ఇప్పటికే ఆమోదం తెలియజేసిన ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి వాటాల విక్రయాలను దీపమ్‌ ( పెట్టుబడుల ఉపసంహరణ విభాగం) మరింత చురుగ్గా నిర్వహించగలదని భావిస్తున్నాము’’ అని మంత్రి చెప్పారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌కామర్స్‌ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం రూపంలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

కానీ ఇప్పటి వరకు సమకూరింది కేవలం రూ.11,006 కోట్లే కావడం గమనార్హం. ఎయిర్‌ ఇండియా, బీపీసీఎల్‌ సహా 25 ప్రభుత్వరంగ సంస్థల్లో పాక్షికంగా, పూర్తిగా వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదం కూడా తెలియజేసింది. ‘‘మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు కొనసాగుతాయి. పలు సావరీన్‌ ఫండ్స్, పెన్షన్‌ ఫండ్స్‌కు ఇచ్చిన పన్ను రాయితీల వల్ల అవి మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రగతిశీల సంస్కరణల వైపు ప్రభుత్వం చూస్తోంది. బలమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదు. స్పష్టమైన పెట్టుబడుల ఉపసంహరణ అంజెండాను ప్రకటించాము’’ అని మంత్రి వివరించారు.  

ఏ చర్య తీసుకున్నా సరిపోదు
ఆర్థిక రంగ పురోగతికి మద్దతుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అయితే, కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏ చర్య అయినా సరిపోదన్నారు. కాకపోతే ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ చర్యలు తీసుకోవడం వల్లే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు