ఆర్థిక వృద్ధికి అన్ని చర్యలు..

13 Aug, 2021 02:14 IST|Sakshi

ధరల కట్టడిపైనా దృష్టి

కోవిడ్‌ ఆంక్షల తొలగింపుతో రికవరీ

సీఐఐ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఎకానమీ వృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. పేదరికాన్ని తగ్గించగలిగే వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందని, అయితే ఇందుకు ద్రవ్యోల్బణాన్ని పణంగా పెట్టలేమని ఆమె చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ‘ఎకానమీలో సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం, ఆర్‌బీఐ కలిసి పనిచేస్తున్నాయి. వృద్ధి సాధనకు రెండూ ప్రాధాన్యమిస్తాయి. అదే సమయంలో ధరల కూడా కట్టడి చేసేందుకు కట్టుబడి ఉన్నాయి. గడిచిన ఏడేళ్లలో అప్పుడప్పుడు తప్ప ద్రవ్యోల్బణం నిర్దేశిత స్థాయి ఆరు శాతాన్ని దాటకపోవడం ఇందుకు నిదర్శనం’ అని చెప్పారు. సంపన్న దేశాల తరహాలో వడ్డీ రేట్లను పెంచే పరిస్థితి భారత్‌లో ఇంకా రాలేదని, ఆర్‌బీఐ అభిప్రాయం కూడా ఇదేనన్నారు.

ఎకానమీ పుంజుకుంటున్న సంకేతాలు..
రాష్ట్రాల్లో కోవిడ్‌–19 కట్టడికి సంబంధించిన ఆంక్షలను తొలగించే కొద్దీ క్రమంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 37 శాతం పెరిగాయని వివరించారు. జులై నాటికి విదేశీ మారక నిల్వలు 620 బిలియన్‌ డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. మహమ్మారిపరమైన కష్టసమయంలోనూ సంస్కరణలకు కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఆమె తెలిపారు.  ఇన్వెస్ట్‌ చేయడానికి పరిశ్రమ ముందుకు రావాలని మంత్రి సూచించారు. 2021–22 బడ్జెట్‌లో నిర్దేశించిన ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

చైనాను కాపీ కొడితే తయారీలో ఎదగలేము: నీతి ఆయోగ్‌ సీఈవో కాంత్‌
యావత్‌ ప్రపంచానికి ఫ్యాక్టరీగా భారత్‌ ఎదగాలంటే తయారీ విషయంలో చైనాను కాపీ కొడితే ప్రయోజనం లేదని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ దిగ్గజంగా ఎదగాలంటే.. వృద్ధికి ఆస్కారమున్న కొంగొత్త రంగాలను గుర్తించి, అవకాశాలు అందిపుచ్చుకోవాలని సీఐఐ సదస్సులో కార్పొరేట్లకు ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు