గ్యాస్‌ రేట్ల సమీక్షకు పారిఖ్‌ కమిటీ ఏర్పాటు

7 Sep, 2022 03:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే సహజ వాయువు రేట్లను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు కిరీట్‌ పారిఖ్‌ సారథ్యం వహిస్తారు. నెలాఖరులోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్‌ రేట్లను నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫార్ములాను ఉపయోగిస్తుంది.

ఏటా రెండు సార్లు .. ఏప్రిల్‌ 1న, అక్టోబర్‌ 1న సమీక్షిస్తోంది. దీని ప్రకారం ఒకోసారి ఉత్పత్తి వ్యయాల కన్నా కూడా ధర తక్కువగా ఉండేది. అయితే, ఈ ఏడాది మార్చి నుంచి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగాను క్రూడాయిల్, గ్యాస్‌ రేట్లు పెరిగాయి. అటు వినియోగదారులకు భారం కాకుండా ఇటు ఉత్పత్తి కంపెనీలూ దెబ్బతినకుండా సముచిత రేటును సిఫార్సు చేసేందుకు పారిఖ్‌ కమిటీ ఏర్పాటైంది.

మరిన్ని వార్తలు