ధరల స్పీడ్‌ను నిలువరిస్తున్నాం..

21 Feb, 2023 01:39 IST|Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టీకరణ

ఇందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి

జైపూర్‌: ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం అన్నారు. ఉదాహరణకు, దేశీయ ఉత్పత్తిని పెంచే దిశలో పప్పుధాన్యాలు పండించడానికి ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. అలాగే స్థానిక లభ్యతను మెరుగుపరచడానికి కొన్ని పప్పుధాన్యాలపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు.

వివిధ వర్గాలతో 2023 బడ్జెట్‌ తదుపరి చర్చాగోష్టి నిర్వహించడానికి ఇక్కడికి వచ్చిన ఆర్థిక మంత్రి విలేకరులతో ఇంకా ఏమన్నారంటే.. ‘‘గత మూడేళ్లుగా వంట నూనెల దిగుమతిపై దాదాపు పన్ను విధించడంలేదు. దీని కారణంగా పామ్‌ క్రూడ్,  పామ్‌ రిఫైన్డ్‌ ఆయిల్‌ అందుబాటులో విఘాతం కలగడం లేదు. వంట నూనెల సరఫరా సులభతరం కావడంతోపాటు, డిమాండ్‌ను దేశం తేలిగ్గా ఎదుర్కొనగలుగుతోంది.  

ధరల స్పీడ్‌ ఇదీ...
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 జనవరిలో 4.73 శాతంగా (2022 ఇదే నెలతో ధరతో పోల్చి) నమోదయ్యింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి టోకు ధరల స్పీడ్‌ నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీలో మెజారిటీ వెయిటేజ్‌ కలిగిన తయారీ, ఇంధనం, విద్యుత్‌ ధరలు తగ్గినా, ఫుడ్‌ ఆర్టికల్స్‌ బాస్కెట్‌ మాత్రం పెరిగింది. టోకు ధరల సూచీ వరుసగా ఎనిమది నెలల నుంచి తగ్గుతూ వస్తుండడం సానుకూల అంశమైనా,  ఆహార ధరల తీవ్రతపై జాగరూకత వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు.

10 నెలల అప్‌ట్రెండ్‌ తర్వాత నవంబర్, డిసెంబర్‌లో ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లోపు ఉన్న వినియోగ ధలర సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో మళ్లీ 6.52 శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. ఈ సూచీలో ఒక్క ఫుడ్‌ బాస్కెట్‌ ధరల స్పీడ్‌ 5.94 శాతంగా ఉంది.  ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధానాలకు ముఖ్యంగా రెపోపై నిర్ణయానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రాతిపది క అయిన సంగతి తెలిసిందే. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4% గా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు), మే 4న మొదటిసారి 0.40% పెరిగింది. జూన్‌ 8, ఆగస్టు 5, సెప్టెంబర్‌ 30 తేదీల్లో అర శాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్‌ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఈ నెల మొదట్లో వరుసగా ఆరవసారి పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగినట్లయ్యింది. దీనితో రెపో మొత్తంగా 6.5 శాతానికి చేరింది.  జనవరి రిటైల్‌ ధరల స్పీడ్‌ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరిగే పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి.    

రాష్ట్రాలకు ఎన్‌పీఎస్‌ నిధులు బదిలీ చేయలేం
కాగా, నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) కోసం డిపాజిట్‌ అయిన నిధులను ప్రస్తుత చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించలేమని అటు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వివేక్‌ జోషి కూడా స్పష్టం చేశారు. ‘‘ఏదైనా రాష్ట్రం ఎన్‌పీఎస్‌ కోసం డిపాజిట్‌ చేసిన నిధులను వారికి తిరిగి ఇవ్వవచ్చని ఆశించినట్లయితే అది అసాధ్యం’’ అని వారు స్పష్టం చేశారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల ఇటీవల భారీ పతనాన్ని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌  ఉటంకిస్తూ, జాతీయ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌)  పెట్టుబడి పెట్టే షేర్‌ మార్కెట్‌ దయాదాక్షిణ్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను  వదిలివేయలేని పేర్కొన్నారు. ఎన్‌పీఎస్‌లో డిపాజిట్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధులను రాష్ట్రాలకు కూడా కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌)కు నిధులను బదిలీ చేయకపోతే రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి, ఆ శాఖ సీనియర్‌ అధికారి నుంచి వచ్చిన ప్రకటనలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పాత పెన్షన్‌ స్కీమ్‌కు తిరిగి వెళ్లడానికి కొన్ని రాష్ట్రాలు నిర్ణయించడం, ఇతర రాష్ట్రాల్లో ఈ డిమాండ్‌ పుంజుకోవడం మంచి పరిణామం కాదని ఆర్థిక కార్యదర్శి జోషి ఈ సందర్భంఆ స్పష్టం చేశారు. ‘‘కొత్త పెన్షన్‌ పథకంలోని డబ్బు ఉద్యోగులకు సంబంధించినది.  ఇది ఉద్యోగి– ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌కు మధ్య ఒప్పందం. ఉద్యోగి మెచ్యూరిటీకి ముందు లేదా పదవీ విరమణ వయస్సు రాకముందే నిష్క్రమిస్తే, అప్పుడు అనుసరించాల్సిన విధానాలపై పలు నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి’’ అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు