డిస్కౌంట్‌ ఇస్తే తప్పేంటి? కానీ...! పీయూష్‌ గోయల్‌ కీలక వ్యాఖ్యలు

28 Apr, 2023 10:05 IST|Sakshi

మోసపూరిత పద్ధతులు, దోపిడీ ధరకు  వ్యతిరేకం

చిన్న వర్తకులను కాపాడుకుంటాం

 ఫ్లాష్‌ సేల్స్‌ పట్ల ఆందోళన లేదు 

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌  

న్యూఢిల్లీ:‘ఈ-కామర్స్‌ వేదికల్లో ఫ్లాష్‌ సేల్స్‌ గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం లేదు. వినియోగదారుల ఎంపికలను పరిమితం చేయడానికి ఈ-రిటైలర్లు ఉపయోగించే దోపిడీ ధర, ఇతర మోసపూరిత పద్ధతులకు తాము వ్యతిరేకం’ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం స్పష్టం చేశారు. ‘ఫ్లాష్‌ సేల్స్‌ ప్రయోజనాలను పొందేందుకు తరచుగా ఈ-మార్కెట్‌ ప్లేస్‌ వేదికల్లోవస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆన్‌లైన్‌ రిటైలర్‌ ఇష్టపడే లేదా ప్రమోట్‌ చేసిన సంస్థల ఉత్పత్తుల వైపునకు మళ్లించబడుతున్నారు. ఇది మోసం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు విరుద్ధం’ అని అన్నారు.   (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్‌: సంబరాల్లో ఉద్యోగులు)

డిస్కౌంట్లతో మంచి డీల్‌.. 
‘ఎవరైనా డిస్కౌంట్‌ ఇవ్వాలనుకుంటే నేనెందుకు ఫిర్యాదు చేయాలి. వినియోగదారులకు మంచి డీల్‌ లభిస్తోంది. ఈ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వస్తువులను డంపింగ్‌ చేయడం ద్వారా దోపిడీ ధరలను అనుసరించడం, వినియోగదారుల ఎంపికలను పరిమితం చేసే పద్ధతుల పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. త్వరలో ప్రవేశపెట్టనున్న ఈ-కామర్స్‌ విధానం ద్వారా అటువంటి మోసాలను ఆపడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. ఫ్లాష్‌ సేల్స్‌ విషయంలో ఈరోజు వినియోగదారుడు ఉత్సాహంగా ఉండవచ్చు. కానీ ఒక విధానకర్తగా నేను భారతీయ కస్టమర్లకు దీర్ఘకాలిక మంచిని చూడవలసి ఉంటుంది. దోపిడీ ధరలను లేదా ప్రజల ఎంపికలను మోసం చేసే విధంగా ఇటువంటి పద్ధతులను మేము వ్యతిరేకిస్తున్నాము’ అని మంత్రి తెలిపారు.  (షాపింగ్‌ మాల్స్‌ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!)

చిన్నవారిని రక్షించుకుంటాం.. 
‘విదేశీ ఈ-కామర్స్‌ సంస్థల వద్ద ఇబ్బడిముబ్బడిగా నిధులున్నాయి. వారికి భారతదేశంలో కొన్ని బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టడం, భారీ నష్టాలను నమోదు చేయడం సమస్య కాదు. ధర, వ్యయాలకు సంబంధం లేకుండా కస్టమర్లను సముపార్జించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టాలను ఈ–కామర్స్‌ సంస్థలు గౌరవించాల్సిందే. మార్కెట్‌ ప్లేస్‌ మార్కెట్‌ ప్లేస్‌గా మాదిరిగానే పనిచేయాలి.

దిగ్గజ ఈ-కామర్స్‌ సంస్థల కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కుటుంబ వ్యాపారాలు మూతపడ్డాయి. చిన్న రిటైల్‌ వ్యాపారులను కాపాడేందుకు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం చివరివరకు వారికి అండగా ఉంటుంది. చిన్న వ్యాపారులను రక్షించే ఈ ప్రయత్నానికి భారత్‌ లేదా విదేశీయులైనా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు.
 
 

మరిన్ని వార్తలు