సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం

7 Feb, 2022 00:43 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు సహా అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సర్వసన్నద్ధంగా ఉందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీతో సమావేశంలో మంత్రి చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్‌ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి అనంతరం ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయని, భారత్‌ ఈసారి అవకాశాలను జారవిడుచుకోకుండా పారిశ్రామిక రంగం చూడాలని ఆమె పేర్కొన్నారు.  

జీఎస్‌టీలోకి ఏటీఎఫ్‌పై చర్చ..
కాగా, విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్‌) వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) పరిధిలోకి చేర్చే అంశాన్ని  జీఎస్‌టీ కౌన్సిల్‌ తదుపరి సమావేశంలో చర్చించనున్నట్లు అసోచాం సమావేశంలో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మరోవైపు, బ్యాంకింగ్‌పరంగా సహకారం లభించేలా ఏవియేషన్‌కు పరిశ్రమ హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిపై బ్యాంకులతో మాట్లాడతామని ఆమె చెప్పారు.  

పెట్టుబడులకు ఆహ్వానం...
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని  సీతారామన్‌ సూచించారు. వృద్ధి వేగం పుంజుకునేలా సత్వరం పెట్టుబడులను పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల సమాఖ్య సీఐఐ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.

మరిన్ని వార్తలు