కస్టమర్ల సమ్మతి లేకుండా నంబర్లు తీసుకోవద్దు..రీటైల్‌ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు

2 Jun, 2023 07:59 IST|Sakshi

న్యూఢిల్లీ: మొబైల్‌ నంబరు ఇవ్వని కస్టమర్లకు రిటైలర్లు సర్వీసులు, రిఫండ్‌లను నిరాకరిస్తున్న ఉదంతాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇటువంటి విధానాలను మానుకునేలా తమ తమ పరిధిలోని రిటైలర్లను కట్టడి చేయాలని పరిశ్రమల సమాఖ్యలకు సూచించింది. ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే సమయంలో కస్టమర్ల సమ్మతి లేకుండా వారి మొబైల్‌ నంబర్లు తీసుకోకుండా చూడాలని పేర్కొంది.

సీఐఐ, ఫిక్కీ, అసోచాం, పీహెచ్‌డీసీసీఐ, రిటైలర్ల అసోసియేషన్‌ ఆర్‌ఏఐ, అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ ఈ మేరకు లేఖ రాశారు. ఉత్పత్తి లేదా సర్వీసు కొనుగోలుకు వినియోగదారు తన మొబైల్‌ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయొద్దని సూచించారు. 

‘మొబైల్‌ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయడం వల్ల పలు సందర్భాల్లో కస్టమర్లు తమ అభీష్టానికి విరుద్ధంగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాత నుంచి వారికి రిటైలర్లు అసంఖ్యాకంగా మార్కెటింగ్, ప్రమోషనల్‌ సందేశాలు పంపిస్తుండటం సమస్యాత్మకంగా ఉంటోంది‘ అని సింగ్‌ పేర్కొన్నారు.

విక్రయ సమయంలో.. కస్టమరుకు ఇష్టం లేకపోయినా, మొబైల్‌ నంబరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం అనేది వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్‌ నంబరు ఇవ్వలేదన్న కారణంతో వినియోగదారుకు విక్రయించకపోవడం, రిటర్నులు .. ఎక్ఛేంజీలు .. రిఫండ్‌లను అనుమతించకపోవడం లేదా వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించకపోవడం అనేవి అనుచిత వ్యాపార విధానాల కిందికే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమాఖ్యలు సహకరించి, రిటైలర్లకు తగు సూచనలను ఇవ్వాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు