కేంద్రం కఠిన నిర్ణయం..అక్రమ ‘నిధి’ సమీకరణలకు చెక్‌ 

21 Apr, 2022 13:54 IST|Sakshi

నిధి కంపెనీల నిబంధనల్లో సవరణలు  

న్యూఢిల్లీ: ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, అక్రమంగా నిధుల సమీకరణను కట్టడి చేసేందుకు ‘నిధి’ కంపెనీల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ తరహా కంపెనీలు (కొన్ని తరగతులకే) నిధి కంపెనీలుగా వ్యాపారం ప్రారంభించాలంటే ముందస్తు ధ్రువీకరణను తప్పనిసరి చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో పలు కంపెనీలు మోసపూరితంగా ప్రజల నుంచి నగదు సమీకరణ చేసి బోర్డు తిప్పేస్తున్న ఘటనలు వెలుగు చూసిన క్రమంలో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ నిబంధనల్లో సవరణలు తీసుకురావడం గమనార్హం.

కంపెనీల చట్టం 1956 కింద దేశవ్యాప్తంగా 390 కంపెనీలు ‘నిధి’ కంపెనీలుగా అర్హత సంపాదించాయి. కానీ, కంపెనీల చట్టం 2013ను 2014 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత నిధి కంపెనీల సంఖ్య పెరిగింది. ‘‘2014 నుంచి 2019 మధ్య కాలంలో పది వేల కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఎన్‌డీహెచ్‌–4 ధ్రువీకరణ కోసం కేవలం 2,300 కంపెనీలే దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కంపెనీల ఎన్‌డీహెచ్‌–4 పత్రాలను పరిశీలిస్తే ‘నిధి నిబంధనలు, 2014 (సవరించిన)’ను పాటించడం లేదని తెలిసింది’’ అని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనాల రీత్యా నిధి కంపెనీగా ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పొందడాన్ని తప్పనిసరి చేసినట్టు పేర్కొంది. నిధి కంపెనీగా ఏర్పడేందుకు సంస్థ షేర్‌ క్యాపిటల్‌ రూ.10లక్షలు ఉంటే అప్పుడు నిధి కంపెనీ గుర్తింపు కోసం ఎన్‌డీహెచ్‌–4 కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఏర్పాటైన 120 రోజుల్లోపు కంపెనీలో సభ్యులు 200 మంది, సంస్థ పరిధిలో రూ.20 లక్షల నిధి అయినా ఉండాలి.  

చదవండి: టెలికం సంస్థల విమర్శలు..గట్టి కౌంటర్‌ ఇచ్చిన ట్రాయ్‌

మరిన్ని వార్తలు