ఇథనాల్‌ తయారీకి ప్రోత్సాహకాలు

20 Aug, 2021 03:37 IST|Sakshi

పెరగనున్న చక్కెర మిల్లుల ఆదాయం

కేంద్ర ఆహార శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: చక్కెర మిల్లులకు ప్రోత్సాహకాలతో కూడిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న సీజన్‌ 2021–22కు సంబంధించి అదనపు దేశీయ విక్రయకోటాను ప్రకటించింది. ఇందులో భాగంగా చెరకును ఇథనాల్‌ తయారీకి వినియోగించే మిల్లులకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న గరిష్ట ధరలను సానుకూలంగా మలుచుకుని అక్టోబర్‌ నుంచి మొదలయ్యే కొత్త సీజన్‌ తొలినాళ్లలోనే ఎగుమతులకు ప్రణాళిక రూపొందించుకోవాలని మిల్లులకు సూచించింది.

దీంతో ఎగుమతులకు సబ్సిడీలను కొనసాగించకపోవచ్చని తెలుస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్‌.. గత రెండేళ్ల నుంచి చక్కెర ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశీయంగా వినియోగం కంటే ఉత్పత్తి అధికంగా ఉండడమే దీనికి కారణం. ఖరీదైన చమురు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా దేశీయంగా ఇథనాల్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే ఇథనాల్‌ తయారీకి చెరకును మళ్లించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది.  

రెండు విధాలుగా ప్రయోజనం
చక్కెరను ఎగుమతి చేసే మిల్లులు.. ఇథనాల్‌ తయారీకి మళ్లించడం ద్వారా ‘అదనపు నెలవారీ దేశీయ కోటా’ కింద ప్రోత్సాహకాలు అందుకోవచ్చంటూ ఆహార శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో చక్కెర విక్రయాలకు నెలవారీ కోటాను (సుమారు 21 లక్షల టన్నులు) కేంద్రం నిర్ణయిస్తోంది. ‘గత నెలరోజుల్లో అంతర్జాతీయంగా చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. భారత ముడి చక్కెరకు ఎంతో డిమాండ్‌ ఉంది. కనుక రానున్న సీజన్‌లో ఎగుమతులకు సంబంధించి మిల్లులు ముందే ప్రణాళిక రూపొందించుకోవాలి. చక్కెర ఎగుమతితోపాటు.. ఇథనాల్‌ తయారీకి మళ్లించడం వల్ల మిల్లులకు నిధుల ప్రవాహం పెరిగి చెరకు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయగలుగుతాయి. ఇది దేశీయంగా ధరల స్థిరత్వానికి, మిల్లులకు ఆదాయం పెరిగేందుకు తోడ్పడుతుంది’ అని ఆహార శాఖ పేర్కొంది.  

మూడు సీజన్లలో రూ.22,000 కోట్లు
గడిచిన మూడు చెరకు సీజన్లలో ఇథనాల్‌ తయారీ వల్ల మిల్లులు రూ.22,000 కోట్ల ఆదాయన్ని పొందినట్టు కేంద్ర ఆహార శాఖ తెలిపింది. ప్రస్తుత సీజన్‌లో ఇథనాల్‌ విక్రయం ద్వారా మిల్లులకు రూ.15,000 కోట్ల ఆదాయం లభించినట్టు వివరించింది. 2019–20 సీజన్‌లో 9,26,000 టన్నుల చక్కెరను ఇథనాల్‌ తయారీకి మిల్లులు వినియోగించాయి. 2018–19లో 3,37,000 టన్ను లతో పోలిస్తే మూడింతలు పెరగడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు