లక్ష్మీ విలాస్‌ ‘ఖాతా’ క్లోజ్‌

26 Nov, 2020 05:10 IST|Sakshi

డీబీఎస్‌ బ్యాంక్‌లో విలీనం నవంబర్‌ 27 నుంచి అమల్లోకి

అదే రోజు నుంచి విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు, ఆంక్షలు కూడా ఎత్తివేత

20 లక్షల మంది డిపాజిటర్లకు ఊరట ∙కేంద్రం, ఆర్‌బీఐ నిర్ణయం

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)ని డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియాలో (డీబీఐఎల్‌) విలీన ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదముద్ర పడింది. విలీన స్కీమ్‌నకుకేంద్ర క్యాబినెట్‌ బుధవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే దీనిపై ఒక ప్రకటన చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ .. నవంబర్‌ 27 (శుక్రవారం) నుంచి విలీనం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆ రోజు నుంచి ఎల్‌వీబీపై విధించిన మారటోరియం కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రూ. 25,000 విత్‌డ్రాయల్‌ పరిమితులు తొలగిపోనున్నాయి. ‘‘నవంబర్‌ 27 నుంచి విలీనం అమల్లోకి వస్తుంది. ఎల్‌వీబీ శాఖలన్నీ కూడా ఆ రోజు నుంచి డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా శాఖలుగా మారతాయి.

ఎల్‌వీబీ డిపాజిటర్లంతా కూడా డీబీఎస్‌ ఖాతాదారులుగా మారతారు. అలాగే, ఎల్‌వీబీపై విధించిన మారటోరియం కూడా ఇక అమల్లో ఉండదు’’ అని ఆర్‌బీఐ పేర్కొంది. ఎల్‌వీబీ ఖాతాదారులకు యథాప్రకారంగా సర్వీసులు అందేలా చూసేందుకు డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా అన్ని ఏర్పాట్లూ చేస్తోందని వివరించింది. వాస్తవానికి మారటోరియం గడువు డిసెంబర్‌ 16తో ముగియనున్నప్పటికీ అంతకన్నా ముందుగానే ఎత్తివేయనుండటం గమనార్హం. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ విలీన స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఎల్‌వీబీ ఉద్యోగులందరికీ కూడా నవంబర్‌ 17నకు ముందు నుంచి అందుకుంటున్న వేతనాలు, సర్వీసు నిబంధనలే ఇకపైనా వర్తిస్తాయి.

సంక్షోభంలో చిక్కుకున్న ఎల్‌వీబీ బోర్డును ఆర్‌బీఐ నవంబర్‌ 17న రద్దు చేసి ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆర్‌బీఐ సిఫార్సుల మేరకు డిపాజిటర్లు రూ. 25,000కు మించి విత్‌డ్రా చేసుకోకుండా  కేంద్రం .. ఎల్‌వీబీపై 30 రోజుల మారటోరియం విధించింది. సింగపూర్‌కి చెందిన సంస్థ డీబీఎస్‌ భారత విభాగం డీబీఐఎల్‌లో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను విలీనం చేసే ప్రతిపాదనను
ఆర్‌బీఐ రూపొందించింది. తాజాగా ఇదే అమల్లోకి రానుంది. ఈ ఏడాది పెను సంక్షోభం ఎదుర్కొన్న బ్యాంకుల్లో యస్‌ బ్యాంక్‌ తర్వాత ఎల్‌వీబీ రెండోది. నిధుల కొరతతో కుదేలైన యస్‌ బ్యాంక్‌పై ప్రభుత్వం మార్చిలో మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐతో 45 శాతం వాటాలు కొనిపించి, రూ. 7,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టించి యస్‌ బ్యాంక్‌ను గట్టెక్కించింది.  

షేరు జూమ్‌..
దాదాపు వారం రోజులుగా లోయర్‌ సర్క్యూట్‌లకు పడిపోతూ వస్తున్న ఎల్‌వీబీ షేర్లు తాజా పరిణామాలతో బుధవారం 5 శాతం పెరిగాయి. బీఎస్‌ఈలో రూ. 7.65 వద్ద (అప్పర్‌ సర్క్యూట్‌) ముగిశాయి. ఒక దశలో లోయర్‌ సర్క్యూట్‌ స్థాయి రూ. 6.95కి, ఏడాది కనిష్టానికి కూడా పడిపోయినప్పటికీ ఆ తర్వాత గణనీయంగా కోలుకోవడం గమనార్హం. ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత నవంబర్‌ 17 నుంచి 24 మధ్య షేరు ధర 53 శాతం పడిపోయింది.  

షేర్‌హోల్డర్లకు సున్నా..?
ఈ మొత్తం లావాదేవీలో షేర్‌హోల్డర్లకు దక్కేదేమీ లేదు. విలీన ప్రతిపాదన తుది స్కీమ్‌ను బట్టి చూస్తే ముసాయిదాలో పేర్కొన్న ఈక్విటీ రైటాఫ్‌లో ఎలాంటి మార్పు లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం లావాదేవీ అనంతరం ఎల్‌వీబీ పెయిడప్‌ షేర్‌ క్యాపిటల్‌ మొత్తాన్ని రైటాఫ్‌ చేయనున్నారు. గురువారం నుంచి ట్రేడింగ్‌ను ఎన్‌ఎస్‌ఈ నిలిపివేయనుంది. శుక్రవారం ఎక్సే్చంజీల నుంచీ ఎల్‌వీబీ షేర్లను డీలిస్ట్‌ చేయనున్నారు.

డిపాజిట్లు సురక్షితం..
ఎల్‌వీబీకి చెందిన 20 లక్షలకు పైగా ఖాతాదా రులు, 4,000 మంది పైగా ఉద్యోగులకు తాజా పరిణామం ఊరట కలిగిస్తుందని క్యాబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. డిపాజిట్ల విత్‌డ్రాయల్‌పై ఇతరత్రా మరే ఆంక్షలు ఉండబోవని ఆయన చెప్పారు. ‘‘ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదు. డిపాజిట్లు సురక్షితమైన చేతుల్లోనే ఉన్నాయి. విత్‌డ్రాయల్‌ కోసం పరుగెత్తాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి తెలిపారు. డీబీఐఎల్‌కు తగినంత స్థాయిలో మూలధనం ఉన్నప్పటికీ  విలీనానంతరం కార్యకలాపాల వృద్ధి కోసం ముందుగానే మరో రూ. 2,500 కోట్ల నిధులను కూడా సమకూర్చుకుంటుందని చెప్పారు.

ఎల్‌వీబీ కనుమరుగు..
సుమారు 94 ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్‌వీబీని వీఎస్‌ఎన్‌ రామలింగ చెట్టియార్‌ సారథ్యంలో తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో ఏర్పాటు చేశారు. 19 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో ఎల్‌వీబీకి 566 శాఖలు, 918 ఏటీఎంలు ఉన్నాయి. బడా సంస్థలకు భారీ స్థాయిలో రుణాలివ్వడం మొదలెట్టినప్పట్నుంచి ఎల్‌వీబీకి కష్టాలు మొదలయ్యాయి. మొండిబాకీలు భారీగా పేరుకుపోవడంతో బ్యాంకుపై ఆర్‌బీఐ గతేడాది  ఆంక్షలు కూడా విధించింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, క్లిక్స్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ సంస్థలతో విలీనమయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. 2019–20లో రూ. 836 కోట్ల నికర నష్టం ప్రకటించిన ఎల్‌వీబీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 397 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా పరిణామాలతో ఎల్‌వీబీ ఇక పూర్తిగా కనుమరుగు కానుంది.

పటిష్టంగా డీబీఐఎల్‌...
సింగపూర్‌ కేంద్రంగా ఆర్థిక సేవలు అందిస్తున్న డీబీఎస్‌కు డీబీఐఎల్‌ భారతీయ  అనుబంధ సంస్థ. డీబీఎస్‌కు ఆసియాలోని 18 మార్కెట్లలో కార్యకలాపాలు ఉన్నాయి. ఎల్‌వీబీని విలీనం చేసుకోవడంతో డీబీఐఎల్‌ శాఖల సంఖ్య 600కు పెరుగుతుంది.    

బాధ్యులపై చర్యలు ఉంటాయి..
ఎల్‌వీబీ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని జవదేకర్‌ తెలిపారు. ‘‘తప్పులు చేసిన వారిపై చర్యలుంటాయి. ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా పర్యవేక్షణ మెరుగుపరుస్తాం. బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇవి కూడా భాగం’’ అని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ కూడా పర్యవేక్షణను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పరిస్థితి చేయి దాటిపోవడానికి ముందే సమస్యను ఆర్‌బీఐ అంచనా వేయగలగాలి. రాబోయే సమ స్యలను పసిగట్టగలిగితే పరిష్కారం సులువవుతుంది’’ అని జవదేకర్‌ వ్యాఖ్యానించారు.   

 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా