ఐఆర్‌సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్‌..

30 Oct, 2021 06:08 IST|Sakshi

భారీ పతనం నుంచి కోలుకున్న షేరు

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్స్‌ ద్వారా వసూలయ్యే కన్వీనియెన్స్‌ ఫీజు ఆదాయంలో వాటాలు తీసుకునే విషయంలో రైల్వేస్‌ బోర్డ్‌ వెనక్కి తగ్గింది. ఐఆర్‌సీటీసీ ప్రయోజనాలు, మార్కెట్‌ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్‌ 1 నుంచి కన్వీనియెన్స్‌ ఫీజులో 50 శాతం వాటాను రైల్వే బోర్డుతో పంచుకోనున్నట్లు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) గురువారం స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసిన సంగతి తెలిసిందే.

దీనికి ప్రతిస్పందనగా శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐఆర్‌సీటీసీ షేరు ధర 25 శాతం పతనమై రూ. 685 స్థాయికి క్షీణించింది. అయితే, రైల్వే బోర్డు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసిన తర్వాత మళ్లీ కొంత కోలుకుంది. చివరికి బీఎస్‌ఈలో సుమారు 7 శాతం క్షీణతతో రూ. 846 వద్ద క్లోజయ్యింది. అయితే, షేర్ల విభజన అమల్లోకి వచ్చిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. కనిష్ట స్థాయిల్లో విక్రయించుకున్న వారు నష్టాలు మూటగట్టుకోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.  

రైలు టికెట్‌ చార్జీలో కన్వీనియెన్స్‌ ఫీజు భాగంగా ఉండదు. వెబ్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ సర్వీసును అందించినందుకు ఐఆర్‌సీటీసీ ఈ ఫీజును వసూలు చేస్తుంది. సాధారణంగా ప్రయాణికుల నుంచి వసూలు చేసే కన్వీనియెన్స్‌ ఫీజు ద్వారా ఐఆర్‌సీటీసీ, రైల్వేస్‌కు గణనీయంగా ఆదాయం లభిస్తుంది. 2014–15లో రెండు సంస్థల మధ్య 20–80 శాతం నిష్పత్తిలో వాటాలు ఉండేవి. అప్పట్లో ఐఆర్‌సీటీసీకి రూ. 253 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత సంవత్సరంలో 50–50 నిష్పత్తికి సవరించినప్పుడు రూ. 552 కోట్లు వచ్చింది. కానీ 2016–17 తర్వాత కన్వీనియెన్స్‌ ఫీజును తొలగించారు. అయితే, 2019–20లో తిరిగి విధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కరోనా వైరస్‌ పరిణామాల కారణంగా ఐఆర్‌సీటీసీ ఆదాయాలు మెరుగుపర్చేందుకు రైల్వేస్‌ తన వాటాను వదులుకుంది. దీంతో 2020–21లో ఐఆర్‌సీటీసీకి రూ. 299 కోట్లు, ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 224 కోట్లు కన్వీనియెన్స్‌ ఫీజు ఆదాయం వచ్చింది.

మరిన్ని వార్తలు