ఫార్మాలో స్వయం సమృద్ధి..

28 Jul, 2020 05:11 IST|Sakshi

దేశవ్యాప్తంగా బల్క్‌ డ్రగ్స్, మెడికల్‌ డివైజ్‌ పార్క్‌ల ఏర్పాటు

నాలుగు ప్రోత్సాహక స్కీమ్‌లు

మార్గదర్శకాలు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశీయంగా బల్క్‌ డ్రగ్స్, వైద్య పరికరాల తయారీని మరింతగా ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బల్క్‌ డ్రగ్, మెడికల్‌ డివైజ్‌ పార్క్‌లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన నాలుగు స్కీముల మార్గదర్శకాలను కేంద్రం సోమవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఫార్మా రంగంలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించే విధంగా ఈ స్కీమ్‌లను రూపొందించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ విలేకరుల సమావేశంలో తెలిపారు.

53 కీలకమైన యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ), వైద్య పరికరాల తయారీలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించాలన్నది లక్ష్యమని ఆయన వివరించారు. వీటికి సంబంధించి భారత్‌ ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు.  కరోనా వైరస్‌ మహమ్మారి పరిణామాలతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, దేశీయంగా వైద్యంపై ప్రతికూల ప్రభావాలు పడే పరిస్థితి నెలకొందని మంత్రి చెప్పారు. అయితే, ఫార్మా రంగం, జాతీయ ఫార్మా ప్రైసింగ్‌ అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించి ఔషధాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇబ్బందులు పడే అవసరం రాలేదన్నారు.

ఈ నేపథ్యంలోనే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని దేశీయంగా ఆయా ఔషధాలు, డివైజ్‌ల ఉత్పత్తిని మరింత పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని మంత్రి చెప్పారు. ‘ప్రస్తుతం దేశీ ఫార్మా రంగ పరిమాణం సుమారు 40 బిలియన్‌ డాలర్లుగా ఉంది. సరైన తోడ్పాటు అందిస్తే 2024 నాటికి ఇది 100 బిలియన్‌ డాలర్లకు చేరగలదు. తద్వారా 2025 నాటికల్లా భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తోడ్పడగలదు‘ అని గౌడ తెలిపారు. ఫార్మా విభాగం రూపొందించిన ఈ స్కీములకు కేంద్ర క్యాబినెట్‌ ఈ ఏడాది మార్చిలో ఆమోదముద్ర వేసింది.

అర్హత ప్రమాణాలను బట్టి ఎంపిక..
పరిశ్రమవర్గాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట స్కీముల మార్గదర్శకాలు రూపొందించినట్లు గౌడ చెప్పారు. మార్గదర్శకాల్లో పొందుపర్చిన అర్హతా ప్రమాణాల్లో ఆయా ఉత్పత్తి సంస్థలకు వచ్చే మార్కుల ఆధారంగా తయారీ ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) స్కీమునకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో ఏర్పాటయ్యే ఈ ఉత్పత్తి పార్కుల్లో అధునాతన ఇన్‌ఫ్రా, మెరుగైన కనెక్టివిటీ, తక్కువ ధరలకు స్థలం, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు అవసరమైన పటిష్టమైన వ్యవస్థ మొదలైనవన్నీ ఉంటాయని పేర్కొన్నారు.

దీనివల్ల కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటులో సమయం, పెట్టుబడి వ్యయాలు తగ్గుతాయని వివరించారు. ‘ఈ స్కీములపై కంపెనీల నుంచి సానుకూల స్పందన ఉంటుందని భావిస్తున్నాం. అధునాతన టెక్నాలజీ, పెట్టుబడులను ఈ పార్కులు ఆకర్షించగలవు. కార్యకలాపాలు ప్రారంభమైన రెండు, మూడేళ్లలో ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కొద్దీ ఉద్యోగాలను కల్పించగలవు, అలాగే దిగుమతులపై ఆధారపడటం తగ్గించగలవు. గ్లోబల్‌ ఫార్మా హబ్‌గా భారత్‌ ఎదిగేందుకు ఉపయోగపడగలవు‘ అని గౌడ చెప్పారు.  

స్వాగతించిన పరిశ్రమ..
దేశీయంగా బల్క్‌ డ్రగ్, మెడికల్‌ డివైజ్‌ల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన స్కీముల మార్గదర్శకాలను పరిశ్రమ స్వాగతించింది. స్కీములు సక్రమంగా అమలైతే 8–10 ఏళ్ల కాలంలో ఏపీఐల తయారీలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించగలదని ఇండియన్‌ డ్రగ్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐడీఎంఏ) ఈడీ అశోక్‌ కుమార్‌ మదన్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు