క్యాబ్‌ సంస్థలపై కొరడా : దిగిరానున్న చార్జీలు

27 Nov, 2020 17:00 IST|Sakshi

ఓలా,ఉబెర్‌ లాంటి సంస్థలపై కొరడా, తాజా నిబంధనలు

సర్జ్‌చార్జ్‌ వాయింపునకు చెక్‌

డ్రైవర్లకు, ప్రయాణీకులకు భద్రత, రక్షణ

డ్రైవర్లకూ  కొత్త రూల్స్‌

సాక్షి,న్యూఢిల్లీ: ఓలా ఉబెర్‌ సహా,ఇతర క్యాబ్‌ సేవల సంస్థలను నియంత్రించేలా వీటిని మోటారు వాహనాల (సవరణ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. క్యాబ్‌ల నిర్వాహక సంస్థలను చట్టం పరిధిలోకి తీసుకొస్తుంది. కాలుష్య నియంత్రణ,వారి వ్యాపారంలో పారదర్శకత, తదితర ప్రయోజనాల కోసం రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలను శుక్రవారం  విడుదల చేసింది. దీంతో క్యాబ్‌ సేవలు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి.

సర్జ్‌ చార్జ్‌ వాయింపులకు చెక్‌, ఇతర నిబంధనలు

  • నవంబర్ 27, శుక్రవారం జారీ చేసిన 26 పేజీల మోటారు వాహన  అగ్రిగేటర్‌ గైడ్‌లైన్స్‌లో ఈ నిబంధనలు రూపొందించింది. ప్రభుత్వం ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లు బాదేస్తున్న సర్జ్‌చార్జీలకు  కేంద్రం చెక్‌ చెప్పింది. అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో  1.5 రెట్లు బేస్ ఛార్జీలకు కోత పెట్టింది. అలాగే అవి అందించే డిస్కౌంట్‌ను బేస్ ఛార్జీలలో 50 శాతానికి పరిమితం చేసింది.
  • స్థానిక ప్రభుత్వం నిర్ణయించని రాష్ట్రాల్లో,  బేస్ ఛార్జీ రూ .25/30గా ఉండాలి. అగ్రిగేటర్లతో అనుసంధానమైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలి.. అయితే బేస్ ఛార్జీలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
  •  వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో అగ్రిగేటర్ నిర్దేశించిన విధంగా చెల్లుబాటు అయ్యే సరైన కారణంగా లేకుండా రైడ్‌ను రద్దు చేసినట్లయితే,  మొత్తం ఛార్జీలో 10శాతం పెనాల్టీ ఇద్దరికీ వరిస్తుంది.  ఇది 100 రూపాయలకు మించకూడదు.
  • కరోనావైరస్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న డ్రైవర్లను ఆదుకునేలా ప్రతీ రైడ్‌ ద్వారా  సంపాదించిన ఆదాయంలో కనీసం 80 శాతం వారికి అందాలని ప్రభుత్వం ఆదేశించింది.  అంతేకాదు  డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందించాలి. రూ .10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ మొత్తం ప్రతీ సంవత్సరం 5 శాతం పెంచాలి.
  • డ్రైవర్లు కూడా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఏ డ్రైవర్  కూడా12 గంటలకు మించి పనిచేయడానికి లేదు. తర్వాత 10 గంటల విరామం తప్పనిసరి.
  • ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో పనిచేసే డ్రైవర్లు 12 గంటల పనిదినం నిబంధనను ఉల్లఘించకుండా అగ్రిగేటర్లు చూసుకోవాలి. వారి భద్రత,  ప్రయాణీకుల భద్రతకు  ఈ పనిగంటలను పర్యవేక్షించేందుకు ఆయా యాప్‌లలో ఒక యంత్రాంగాన్ని తీసుకురావాలని కోరింది.

యాప్‌ ఆధారిత మొబిలిటీ సేవలను అందిస్తున్న సంస్థలు జవాబుదారీతనం వహించేలా చట్టానికి సవరణలు చేసింది. ముఖ్యంగా ‘అగ్రిగేటర్’ అనే పదం నిర్వచనాన్ని చేర్చేందుకు మోటారు వాహనాల చట్టం,1988ను మోటారు వాహనాల సవరణ చట్టం, 2019 ద్వారా సవరించామని రహదారి మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం వీరిని సెంటర్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు  వెల్లడించింది.  ఇందులో తమ ప్రాధమిక లక్ష్యం షేర్డ్ మొబిలిటీ సంస్థల సేవలను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని నివారించడమని స్పష్టం చేసింది. క్యాబ్‌  సేవల సంస‍్థలు కస్టమర్ భద్రత, డ్రైవర్ సంక్షేమంపై బాధ‍్యత వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా తప్పదని తెలిపింది.

సవరించిన సెక్షన్ 93 మార్గదర్శకాల ప్రకారం క్యాబ్‌ సంస్థలు తమసేవలను, కార్యకలాపాలను ప్రారంభించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. వీటి నియంత్రణకోసం కేంద్రం పేర్కొన్న నిబంధనలను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశిస్తుంది.క్యాబ్‌సేవల సంస్థల నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. తద్వారా అగ్రిగేటర్లు జవాబుదారీగా ఉండటంతో పాటు, వారి కార్యకలాపాలకు బాధ్యత వహించేలా నిర్ధారించుకోవాలి. ఉపాధి కల్పన, సౌకర్యవంతమైన, సరసమైన ధరల్లో ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించే లక్ష్యంతో క్యాబ్‌ సేవల సంస్థల బిజినెస్‌ సాగాలి. ప్రజా రవాణ వ్యవస్థను గరిష్టంగా వినియోగించడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, వాహనాల ఉద్గార కాలుష్యాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. తద్వారా మానవ ఆరోగ్యానికి హాని తగ్గించడం అనే లక్ష్యాన్ని సాధించాలనేది ప్రభుత్వ వ్యూహం. దీంతోపాటు తాజా  సవరణ ప్రకారం వాహన యజమాని (అతడు / ఆమె) మరణించిన సందర్భంలో,  తమ వాహనాన్ని నమోదు లేదా బదిలీ  చేసే వ్యక్తిని నామినేట్ చేయవచ్చని మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ తెలిపింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా