నాలుగు నెలల్లో లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం వసూళ్లు

5 Sep, 2021 20:27 IST|Sakshi

ఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం వసూళ్లు 48% పెరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన డేటా ప్రకారం, ఏప్రిల్-జూలై 2021 మధ్య ఎక్సైజ్ సుంకం వసూళ్లు లక్ష కోట్లకు పైగా వసూలు అయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల(ఏప్రిల్ - జూలై) కాలంలో వసూళ్లు రూ.32,492 కోట్లు పెరిగి సుమారు రూ.1,00,387 కోట్లకు చేరుకుంది. 

గత కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఎ ప్రభుత్వం ఇంధనానికి సబ్సిడీ ఇవ్వడానికి జారీ చేసిన చమురు బాండ్లను తిరిగి చెల్లించడానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.10,000 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కేవలం ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలలోనే రూ.32,492 కోట్లు వసూలు అయ్యాయి. అంటే.. ఈ చమురు బాండ్ల కింద చెల్లించాల్సిన డబ్బు కంటే మూడు రేట్లు అదనంగా ఎక్సైజ్ సుంకం వసూలు అయ్యింది. ఎక్సైజ్ సుంకం వసూలులో ఎక్కువ భాగం పెట్రోల్, డీజిల్ నుంచే ఉంది. ఎకానమీ పుంజుకోవడంతో, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఎక్సైజ్ సుంకం వసూళ్లు గత సంవత్సరంతో పోలిస్తే లక్ష కోట్లకు పైగా పెరగవచ్చు అని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.(చదవండి: ఈడీ నోటీసులను కోర్టులో సవాల్‌ చేసిన సచిన్ బన్సాల్

అయితే, పెట్రో ధరల పెరుగుదల విషయంలో కేంద్ర చెబుతున్న సమాధానాలు వేరేగా ఉన్నాయి. గత ప్రభుత్వం చమురు కంపెనీలకు రూ.1.34 లక్షల కోట్ల విలువైన బాండ్లను జారీ చేసింది. ఇప్పుడు దానికి వడ్డీ + అసలు చెల్లించాల్సి వస్తున్నట్లు తెలిపింది. మరోవైపు పెట్రో ఉత్పత్తులపై ఇప్పటికే కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. 2020-21 మధ్య కాలంలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3.35 లక్షల కోట్లు సమకూరింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.1.78లక్షల కోట్లుగా ఉంది. అంటే 88 శాతం మేర పెరిగినట్లు ఇటీవల పార్లమెంట్‌కు ఇచ్చిన సమాధానంలో కేంద్రమే పేర్కొంది. ప్రజలను తప్పు దోవ పట్టించడానికి కేంద్రం అబద్దం చెబుతున్నట్లు ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. పెట్రోల్ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని గత ఏడాది లీటరుకు రూ.19.98 నుండి రూ.32.9కు పెంచారు.

మరిన్ని వార్తలు