వీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి కేంద్రం ఔట్‌

20 Jan, 2021 11:51 IST|Sakshi

టాటా కమ్యూనికేషన్స్‌లో వాటా విక్రయానికి రెడీ 

సాక్షి, న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్‌(గతంలో వీఎస్‌ఎన్‌ఎల్‌) నుంచి కేంద్రం  ప్రభుత్వం వైదొలగనుంది. కంపెనీలోని  26.12 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ఇందుకు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌), వ్యూహాత్మక విక్రయాలకు తెరతీయనుంది. టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రభుత్వానికున్న వాటాను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయించనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ(దీపమ్‌) తాజాగా పేర్కొంది.

ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 8,400 కోట్లవరకూ లభించే వీలుంది. బుధవారాని(20)కల్లా లావాదేవీలను పూర్తిచేయనున్నట్లు దీపమ్‌ వెల్లడించింది. తద్వారా వీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. ఓఎఫ్‌ఎస్‌లో విక్రయంకాకుండా మిగిలిన వాటాను వ్యూహాత్మక భాగస్వామి పానటోన్‌ ఫిన్‌వెస్ట్‌కు ఆఫర్‌ చేయనున్నట్లు దీపమ్‌ తెలియజేసింది. పీఎస్‌యూ సంస్థ వీఎస్‌ఎన్‌ఎల్‌ను 2002లో ప్రైయివేటైజ్‌ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఈ సంస్థ టాటా కమ్యూనికేషన్స్‌గా ఆవిర్భవించింది. కాగా.. బీఎస్‌ఈలో టాటా కమ్యూనికేషన్స్‌ షేరు 1 శాతం బలపడి రూ. 1130 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు