తోలు పరిశ్రమకు ప్రోత్సాహకాలు పొడిగింపు!

6 Sep, 2021 06:26 IST|Sakshi

2025–26 వరకు పథకాన్ని పెంచే అవకాశం

న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ, ఉపాధి కల్పన, ఎగుమతులకు ఊతమిచ్చే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తోలు, పాదరక్షల పరిశ్రమలకు ప్రోత్సాహక పథకాన్ని (ఐఎఫ్‌ఎల్‌ఏడీపీ) 2025–26 దాకా పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2021–22 నుంచి 2025–26 మధ్య కాలంలో ఈ స్కీమ్‌ కింద రాయితీల విలువ సుమారు రూ. 1,700 కోట్ల మేర ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమరి్పంచిందని, కేంద్ర క్యాబినెట్‌ దీన్ని త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యయాలపై ఆరి్థక శాఖ కమిటీ దీనికి ఇప్పటికే ఆమోదముద్ర వేసిందని వివరించారు.

గతంలో 2017–18 నుంచి 2019–20 మధ్య కాలంలో రూ. 2,600 కోట్ల వ్యయాల అంచనాలతో కేంద్రం ఐఎఫ్‌ఎల్‌ఏడీపీని ప్రకటించింది. తాజాగా పథకం ప్రకారం తోలు, పాదరక్షల రంగంలో దేశీ బ్రాండ్‌ల ప్రమోషన్‌ కోసం రూ. 100 కోట్లు, డిజైన్‌ స్టూడియోల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు, తోలు పరిశ్రమ సమగ్రాభివృద్ధి కోసం రూ. 500 కోట్లు, సంస్థాగత కేంద్రాల ఏర్పాటుకు రూ. 200 కోట్లు మేర వ్యయాల ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం 10 భారతీయ బ్రాండ్‌లను ప్రమోట్‌ చేసేందుకు అవసరమైన సహకారం లభిస్తుంది. 10 డిజైన్‌ స్టూడియోల అభివృద్ధి కోసం కావాల్సిన సహాయం అందుతుంది. ఇక మెగా లెదర్‌ ఫుట్‌వేర్, యాక్సెసరీస్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ సబ్‌–స్కీమ్‌ కింద స్థల అభివృద్ధి, తయారీ కేంద్రాలు, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలపరమైన తోడ్పాటు లభిస్తుంది.

మరిన్ని వార్తలు