చిన్న పరిశ్రమలకు మరో నెల ‘రుణ’ హామీ

3 Nov, 2020 05:55 IST|Sakshi

న్యూఢిల్లీ: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) సంబంధించి అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఎమర్జె్జన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌–ఈసీఎల్‌జీఎస్‌) కేంద్రం సోమవారం మరో నెలపాటు పొడిగించింది. ఈ పథకం నవంబర్‌ 30వ తేదీ వరకూ అమలవుతుంది. నిజానికి అక్టోబర్‌తో ఈ పథకం గడువు ముగిసింది. దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకున్న పరిస్థితుల్లో–  మేనెల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  రూ. 20లక్షల కోట్ల విలువైన ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజ్‌ (స్వావలంభన భారత్‌) ప్రకటించారు. ఇందులో భాగంగా చిన్న ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం లక్ష్యంగా రూ.3 లక్షల కోట్ల ఈసీఎల్‌జీఎస్‌ను ఆవిష్కరించారు. అక్టోబర్‌ చివరి వరకూ లేదా రూ.3 లక్షల కోట్ల రుణ మంజూరు అయ్యే వరకూ పథకం అమల్లో ఉండాలన్నది పథకం లక్ష్యం. అయితే నిర్దేశించుకున్న మేరకు రూ.3 లక్షల కోట్ల రుణ మంజూరీలు జరక్కపోవడంతో లాంఛనంగా మరో నెలపాటు పథకం గడువును ఆర్థిక మంత్రిత్వశాఖ పొడిగించింది. వచ్చేది పండుగ సీజన్‌ కాబట్టి, వ్యవస్థలో డిమాండ్‌ పుంజుకుంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఈ పథకం చిన్న పారిశ్రమలకు ప్రయోజనకరంగా ఉంటుందని  ఆర్థికశాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు