డోలో కంపెనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...ఆ వైద్యులకు ఝలక్‌

15 Jul, 2022 19:10 IST|Sakshi

సాక్షి,ముంబై: కోవిడ్‌ సంక్షోభంలో కోట్ల రూపాయలు దండుకున్న డోలో-650 మేకర్‌ మైక్రోల్యాబ్స్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డోలో-650 తయారీదారుల ‘అనైతిక పద్ధతులను’ పరిశోధించడానికి ప్రభుత్వం సెపరేట్‌ అండ్‌ స్పెషల్‌ ప్యానెల్‌ను రూపొందించాలని ఫార్మస్యూటికల్‌ విభాగాన్ని ఆదేశించింది. ఈ ప్యానెల్‌ నివేదికను జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఫార్మా మార్కెటింగ్  పద్ధతులపై కోడ్‌ రూపొందించి ఎథిక్స్ కమిటీకి అందించాలని కోరింది. ఈ విభాగం రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది.

అంతేకాదు మైక్రోల్యాబ్స్‌ ద్వారా ప్రయోజనాలు పొందిన వైద్యుల వివరాలను సేకరించి వారికి షోకాజ్‌ నోటీసు లివ్వాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. కంపెనీ ప్రాంగణంలో దాడులు చేసి పేర్లు బయటపడ్డ వైద్యులకు షోకాజ్ నోటీసులు పంపాలని మంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులను ఆదేశించిందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఫార్మా స్యూటికల్ సంస్థల  అనైతిక చర్యల గురించి తెలుసుకోవాలని కోరింది. ఇప్పటివరకు, మధుమేహం,  కార్డియో, మానసిక చికిత్స అనే మూడు విభాగాల ఫార్మా కంపెనీలు డబ్బును పెట్టుబడి పెట్టేవి, వైద్యులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించేవని తెలుసంటూ మరో అధికారి  వ్యాఖ్యానించారు.

కాగా బెంగళూరుకు చెందిన డోలో-650 తయారీదారు మైక్రోల్యాబ్స్‌ అనైతిక విధానాలకు పాల్పడుతోందనీ, తమ ఉత్పత్తులను  ప్రోత్సహించేందుకు వైద్యులు, వైద్య నిపుణులకు సుమారు రూ.1,000 కోట్ల ఉచితాలను ఇచ్చిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) బుధవారం ఆరోపించింది. ఆసుపత్రి పరికరాలు, బంగారు ఆభరణాలు, విదేశీ పర్యటనలు, ఇతరత్రా ఉచితాలతో వారిని ఆకర్షించినట్టు సీబీడీటీ పేర్కొంది. అధికారి వెబ్‌సైట్ ప్రకారం  మైక్రోల్యాబ్స్ విక్రయాల పరంగా 19వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా లక్షా, 50 వేలకు పైగా వైద్యుల ద్వారా తమ ఉత్పత్తులపై ప్రచారాన్ని నిర్వహిస్తోంది. తాజా పరిణామాలపై మైక్రో ల్యాబ్స్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు