నిర్మాణ రంగానికి కేంద్రం బూస్ట్‌

10 Nov, 2021 01:02 IST|Sakshi

ఆర్బిట్రేషన్‌ పక్రియలో ఆగిన మొత్తంలో 75 శాతం ఇకపై కాంట్రాక్టర్‌కు లభ్యం

మంత్రిత్వశాఖలకు వర్తింపజేస్తూ నిబంధనల రూపకల్పన అయితే బ్యాంక్‌ గ్యారెంటీ తప్పనిసరి  

న్యూఢిల్లీ: నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్యను నివారించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఆర్బిట్రేషన్‌ పక్రియలో నిలిచిపోయిన మొత్తంలో 75 శాతం ఈ రంగానికి అందుబాటులోకి వచ్చే విధంగా నిబంధనల రూపకల్పన చేసింది. దీనిప్రకారం, కాంట్రాక్టర్‌కు అనుకూలంగా ఆర్బిట్రల్‌ అవార్డును (తీర్పు)ను ఒక మంత్రిత్వ శాఖ దాని విభాగం అప్పీలేట్‌ కోర్టులో సవాలు చేసిన సందర్భంలో అవార్డు ప్రకారం ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతం కాంట్రాక్టర్‌కు ఇకపై లభ్యమయ్యే అవకాశం ఏర్పడింది. అయితే ఇందుకు సంబంధిత కాంట్రాక్టర్‌ బ్యాంక్‌ గ్యారెంటీని సమర్పించాల్సి ఉంటుంది.  

ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు అమలు... 
నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ మేరకు ఇప్పటికే నిర్దేశాలు ఉన్నాయి. 2019 నవంబర్‌లో కేంద్ర క్యాబినెట్‌ ఒక నిర్ణయం తీసుకుంటూ, ఆర్బిట్రేషన్‌ అవార్డును ఏదైన ప్రభుత్వ రంగ సంస్థ సవాలు చేసిన సందర్భంలో ‘బ్యాంక్‌ గ్యారెంటీ’పై కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతాన్ని చెల్లించాలని చెల్లించాలని నిర్దేశించింది. ఇప్పుడు ఈ నిబంధనను మంత్రిత్వశాఖలకూ వర్తింపజేస్తూ నిబంధనలు రూపొందించింది. ఇందుకు సంబంధించి జనరల్‌ ఫైనాన్షియల్‌ రూల్‌ (జీఎఫ్‌ఆర్‌)లో 227ఏ కొత్త రూల్‌ను జోడిస్తున్నట్లు వ్యయ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది.  ‘మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్‌ మధ్యవర్తిత్వ అవార్డ్‌ను సవాలు చేసిన సందర్భాలలో, ఆర్బిట్రల్‌ అవార్డ్‌ మొత్తాన్ని చెల్లించనట్లయితే, అవార్డ్‌లో 75 శాతాన్ని కాంట్రాక్టర్‌/రాయితీదారుకు  బ్యాంక్‌ గ్యారెంటీపై మంత్రిత్వశాఖ /డిపార్ట్‌మెంట్‌ చెల్లించాలి‘అని తన తాజా ఉత్తర్వుల్లో కేంద్ర వ్యయ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.  

మరిన్ని వివరాలు పరిశీలిస్తే... 

  • బ్యాంక్‌ గ్యారెంటీ ఆర్బిట్రల్‌ తీర్పులో పేర్కొన్న 75 శాతానికి మాత్రమే వర్తిస్తుంది.  తదుపరి కోర్టు ఉత్తర్వుల ప్రకారం పేర్కొన్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఏర్పడినట్లయితే,  మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్‌కు చెల్లించాల్సిన వడ్డీకి ఇది వర్తించబోదు.  
  • చెల్లింపులు ఎస్క్రో ఖాతాలోకి జరుగుతాయి. అయితే అంది వచ్చిన డబ్బు వినియోగంలో ముందుగా రుణదాతల బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలి. చెల్లింపుల్లో మిగిలిన మొత్తాన్ని ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి ఉపయోగించాలి లేదా పరస్పరం అంగీకరించిన,  నిర్ణయించుకున్న అదే మంత్రిత్వ శాఖ/ డిపార్ట్‌మెంట్‌ ఇతర ప్రాజెక్ట్‌ల పూర్తికి కూడా ఉపయోగించవచ్చు. 
  • రుణదాతల బకాయిల పరిష్కారం, అటుపై మంత్రిత్వశాఖ/డిపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ల పూర్తి తర్వాత ఎస్క్రో ఖాతాలో మిగిలి ఉన్న ఏదైనా బ్యాలెన్స్‌ను లీడ్‌ బ్యాంకర్,  మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్‌ ముందస్తు అనుమతితో కాంట్రాక్టర్‌/రాయితీదారు వినియోగించుకోవచ్చు.  
  • నిలిపివేసిన ఏదైనా డబ్బు లేదా ఇతర మొత్తాలను కూడా బ్యాంక్‌ గ్యారెంటీపై కాంట్రాక్టర్‌కు విడుదల చేయవచ్చు. 
  • అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా,  సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లేదా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అభిప్రాయం తీసుకుని ఆర్బిట్రల్‌ తీర్పును, దానిపై ఏదైనా అప్పీల్‌ను పరిష్కరించుకోడానికి (కొట్టివేయించడానికి) తగిన నిర్ణయాన్ని ప్రభుత్వ సంస్థలు తీసుకోవచ్చు.  
  • ఆర్బిట్రల్‌ అవార్డు అప్పీల్స్, ఆయా ఆంశాల పెండింగ్‌ సందర్భాల్లో  కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడంలేదు. సంబంధిత న్యాయ ప్రక్రియ ముగింపునకు సంవత్సరాలు పడుతున్న నేపథ్యం లో కేంద్రం ఈ చర్యలపై దృష్టి సారించింది. 

మరిన్ని వార్తలు