చిన్న పొదుపు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త

29 Sep, 2022 19:59 IST|Sakshi

న్యూఢిల్లీ: వరుసగా రేట్ల తగ్గింపులతో చిన్నబోయిన చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్యోల్బణం కట్టడికి కీలకమైన వడ్డీ రేట్లను పెంచుతూ వెళుతున్నాయి. మన ఆర్‌బీఐ కూడా ఇదే బాటలో నడుస్తోంది.

మే చివరి నుంచి ఇప్పటి వరకు 1.4 శాతం మేర రెపో రేటును పెంచింది. దీంతో మార్కెట్‌ తీరుకు అనుగుణంగా, తొమ్మిది వరుస త్రైమాసికాల యథాతథ స్థితి తర్వాత.. చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సైతం కేంద్ర సర్కారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 0.30 శాతం వరకు పలు పథకాల రేట్లను పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. పన్ను పరిధిలోకి వచ్చే పథకాలపై ప్రధానంగా రేట్లను పెంచింది. అదే సమయంలో కొన్ని పథకాల రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రతి త్రైమాసికానికీ ఈ పథకాల రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది.

ఇందులో భాగంగా అక్టోబర్‌ 1 నుంచి మొదలయ్యే తదుపరి మూడు నెలల కాలానికి తాజా రేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌పై ప్రస్తుతం 5.5 శాతం రేటు ఉంటే, ఇక మీదట ఇది 5.8 శాతం కానుంది. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై రేటు 0.20 శాతం పెరిగి 7.6 శాతానికి చేరింది. ప్రస్తుతం ఈ పథకంలో రేటు 7.4 శాతంగా ఉంది. కిసాన్‌ వికాస్‌ పత్ర రేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి (123 నెలలకు మెచ్యూరిటీ).. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో రేటును 6.6 శాతం నుంచి 6.7 శాతానికి కేంద్రం సవరించింది.   

వీటిల్లో మార్పు లేదు..: ఏడాది, ఐదేళ్ల ఎఫ్‌డీలు, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) పథకాల రేట్లు ప్రస్తుతమున్న మాదిరే మరో మూడు నెలలు కొనసాగుతాయి. ఈ పథకాల రేట్లను కేంద్రం సవరించలేదు. సవరించిన రేట్లు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 

మరిన్ని వార్తలు