టెలివిజన్‌ ధరలకు రెక్కలు

21 Sep, 2020 07:00 IST|Sakshi

అక్టోబర్‌ 1 నుంచి ఓపెన్‌ సెల్‌  దిగుమతులపై 5% సుంకం

న్యూఢిల్లీ: టీవీల తయారీలో ఉపయోగించే కీలకమైన ఓపెన్‌ సెల్‌ దిగుమతులపై అక్టోబర్‌ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని మళ్లీ అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశీయంగా వీటిని తయారు చేసేందుకు మరికాస్త సమయం కావాలని గతేడాది పరిశ్రమ కోరడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 దాకా కస్టమ్స్‌ సుంకం నుంచి కేంద్రం మినహాయింపునిచ్చినట్లు వివరించాయి.

ఈ గడువు తీరిపోతుండటంతో అక్టోబర్‌ 1 నుంచి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, సుంకం విధింపుతో టీవీల ధరలు దాదాపు 4 శాతం దాకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 32 అంగుళాల టీవీల రేట్లు రూ. 600 మేర, 42 అంగుళాల టీవీ రేటు రూ. 1,200–1,500 దాకా పెరుగుతాయని పేర్కొన్నాయి. అయితే, ఓపెన్‌ సెల్‌ ప్రాథమిక ధరను బట్టి చూస్తే దిగుమతి సుంకం భారం రూ. 150–250కి మించదని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఓపెన్‌ సెల్‌ వంటి కీలకమైన ఉత్పత్తులను ఎల్లకాలం దిగుమతి చేసుకుంటూ ఉంటే దేశీయంగా టీవీల తయారీ రంగం ఎదగలేదని పేర్కొన్నాయి. ఇలాంటి వాటిని దేశీయంగా తయారు చేయడానికి సుంకం విధింపు తోడ్పడగలదని వివరించాయి. 

మరిన్ని వార్తలు