చిన్న మొత్తాల పొదుపు రేట్లు యథాతథం

1 Jul, 2022 06:33 IST|Sakshi

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో 2022–23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గాను (జూలై–సెప్టెంబర్‌) ఈ స్కీమ్‌లపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2020–21 ఏడాది తొలి త్రైమాసికం నుండి ఈ రేట్లను కేంద్రం సవరించలేదు. మూడు నెలలకు ఒకసారి ఆర్థిక శాఖ ఈ వడ్డీరేట్లను నోటిఫై చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా మే, జూన్‌ నెలల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక వడ్డీరేటు రెపోను ఏకంగా 0.9 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కూడా తమ డిపాజిట్, రుణ రేట్ల పెంపునకు తెరతీశాయి.

ఇండియన్‌ బ్యాంక్‌ రుణ రేట్ల పెంపు
ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ గురువారం నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.15 శాతం వరకూ పెంచింది. అన్ని కాలపరమితులకు సంబంధించి రుణ రేట్లు పెరగనున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. పెరిగిన రేట్లు ఆదివారం నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంక్‌ ప్రకటన ప్రకారం, వినియోగ రుణ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.40 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్‌ నుంచి 6 నెలల మధ్య కాలవ్యవధుల రుణ రేట్లు 6.75 శాతం నుంచి 7.40 శాతం శ్రేణిలో పెరిగాయి. వీటితోపాటు బ్యాంక్‌ ట్రజరీ బిల్స్‌ ఆధారిత (టీబీఎల్‌ఆర్‌) రుణ రేటును, బెంచ్‌ మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును (బీపీఎల్‌ఆర్‌) కూడా పెంచింది. 3 నెలల నుంచి మూడేళ్ల కాలానికి పెంపు శ్రేణి 5 నుంచి 6.10 శాతం వరకూ ఉంది. పెంపు 0.40 శాతం నుంచి 0.55% వరకూ నమోదయ్యింది. ఇక బేస్‌ రేటు 8.30 శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది.

మరిన్ని వార్తలు