5 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఓఎన్‌డీసీ

30 Apr, 2022 04:18 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాల ఆధిపత్యాన్ని తగ్గించి, చిన్న రిటైలర్లకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ) విధానాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అయిదు నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఢిల్లీ – నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌), బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్‌ ఈ నగరాల్లో ఉన్నాయి. ఈ–కామర్స్‌ ప్రయోజనాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా ఎంపిక చేసిన వినియోగదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్‌ సేవల సంస్థలకు ఓఎన్‌డీసీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

ఆయా నగరాల్లో 150 మంది రిటైలర్లను ఓఎన్‌డీసీలో చేర్చాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్రస్తుతం 80 సంస్థలు ఓఎన్‌డీసీతో కలిసి పనిచేస్తున్నాయని, వాటిని అనుసంధానం చేసే ప్రక్రియ వివిధ దశల్లో ఉందని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) అదనపు కార్యదర్శి అనిల్‌ అగ్రవాల్‌ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో 100 నగరాలకు చేరాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు చేరువయ్యేందుకు ప్రాంతీయ భాషల్లోనూ యాప్‌లను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నట్లు అగ్రవాల్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు