త్వరలో అడ్వాన్స్‌డ్‌ బ్యాటరీ టెక్నాలజీ విధానం

12 Feb, 2021 04:48 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహన రంగం వృద్ధికి కట్టుబడి ఉన్నాం

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాలు, ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడే అత్యాధునిక బ్యాటరీ సాంకేతికతలో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం త్వరలో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ వాహన రంగం వృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే సెల్స్‌ను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర విధానం అవసరమని మంత్రి చెప్పారు. ఆటోమొబైల్‌ తయారీతో పాటు విద్యుత్‌ వాహనాల విషయంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారత్‌ ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ ఇంధనాల పరిశోధన, అభివృద్ధి అంశంపై జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కే విజయ రాఘవన్, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధనానికి సంబంధించిన పరిశోధనలు ఎవరికి వారు విడివిడిగా చేస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి అంతా కలిసికట్టుగా పనిచేస్తే అత్యుత్తమ టెక్నాలజీలను అభివృద్ధి చేయొచ్చు. దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాం. ఆయా టెక్నాలజీల లాభదాయకతపై కూడా దృష్టి పెడతాం. ఇందుకోసం ప్రత్యేక విధానం అవసరం‘ అని మంత్రి చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు