ఫార్మా ఎంఎస్‌ఎంఈలకు కొత్త పథకాలు

22 Jul, 2022 01:30 IST|Sakshi

చిన్న కంపెనీల బలోపేతమే లక్ష్యం

ఫార్మా క్లస్టర్లలో సదుపాయాల కల్పన

ఉమ్మడి కేంద్రాల ఏర్పాటుకు నిధుల సాయం

కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర సర్కారు మూడు కొత్త పథకాలను గురువారం ప్రారంభించింది. ఈ వివరాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మీడియాకు తెలిపారు. టెక్నాలజీ నవీకరణ, ఫార్మా ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల వద్ద ఉమ్మడి పరిశోధన కేంద్రాలు, వ్యర్థాల శుద్ధి కర్మాగాలను ఈ పథకాల కింద ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.

చిన్న కంపెనీలు అయినా కానీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ‘‘ఈ పథకాల నుంచి ఫార్మా రంగం ఎంతో ప్రయోజనం పొందుతుంది. దీర్ఘకాలంలో భారత ఫార్మా పరిశ్రమ మరింత బలోపేతంగా, భవిష్యత్తుకు సన్నద్ధంగా, స్వావలంబన సాధిస్తుంది’’అని మాండవీయ అన్నారు.

ఫార్మా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు టెక్నాలజీ నవీకరణకు వడ్డీ సబ్సిడీతో కూడిన రుణాలను పొందొచ్చు. ఉమ్మడి పరిశోధన, టెస్టింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు రూ.20 కోట్ల వరకు లభిస్తుంది. సిడ్బీ ఈ పథకాల అమలుకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుంది. రూ.10 కోట్ల వరకు తీసుకునే రుణాలకు 10 శాతం క్యాపిటల్‌ సబ్సిడీ కూడా లభిస్తుంది. మూడేళ్ల కాల వ్యవధికి తీసుకోవచ్చు. ఫార్మా క్లస్టర్లలో సదుపాయాల అభివృద్ధికి చేపట్టే ప్రాజెక్టు వ్యయంలో 70 శాతాన్ని (రూ.20 కోట్ల వరకు) కేంద్రం సమకూరుస్తుంది.

మరిన్ని వార్తలు