ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు ‘సింగిల్‌ విండో’

23 Sep, 2021 01:42 IST|Sakshi

ఆవిష్కరించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గోయల్‌

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు అనుమతుల కోసం జాతీయ స్థాయిలో సింగిల్‌ విండో విధానాన్ని అందుబాటులోకి తెచి్చంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం దీన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. దీనితో వ్యాపారాలను నమోదు చేసుకునేందుకు, ఇన్వెస్ట్‌ చేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సిన సమస్య తప్పుతుందని ఆయన పేర్కొన్నారు. ‘వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, భారత్‌ సిసలైన స్వావలంబన సాధించడం లక్ష్యాలను సాకారం చేసుకునే దిశగా ఇది ముఖ్యమైన పరిణామం.

దీనితో బ్యూరోక్రసీ నుంచి, వివిధ విభాగాల చూట్టూ తిరగడం నుంచి స్వాతంత్య్రం లభిస్తుంది‘ అని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ పోర్టల్‌ ద్వారా 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 9 రాష్ట్రాలకు సంబంధించిన అనుమతులు పొందవచ్చు. డిసెంబర్‌ ఆఖరు నాటికి మరో 14 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఇంకో 5 రాష్ట్రాలను చేరుస్తామని గోయల్‌ తెలిపారు. నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌ బీటా వెర్షన్‌ ప్రజలు, సంబంధిత వర్గాలందరికీ అందుబాటులో ఉంటుంది. యూజర్లు, పరిశ్రమ ఫీడ్‌బ్యాక్‌ బట్టి ఇందులో మరిన్ని అనుమతులు, లైసెన్సుల జారీ ప్రక్రియకు సంబంధించిన అంశాలను జోడించనున్నట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.  

పారదర్శకతకు పెద్ద పీట..: సమాచారం అంతా ఒకే పోర్టల్‌లో అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని గోయల్‌  వివరించారు. పరిశ్రమ, ప్రజలు, సంబంధిత వర్గాలు అందరితో కలిసి టీమ్‌ ఇండియాగా పనిచేసేందుకు ప్రభుత్వం ముందుకొచి్చందని, సమష్టి కృషి ఫలితమే ఈ పోర్టల్‌ అని చెప్పారు. దరఖాస్తు మొదలుకుని దాని అనుమతుల ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, సందేహాలకు తగు వివరణలు ఇచ్చేందుకు ఇందులో దరఖాస్తుదారు కోసం ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్‌ ఉంటుందని పేర్కొన్నారు. పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ వైపే యావత్‌ప్రపంచం చూస్తోందని గోయల్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు