రుణ లక్ష్యాన్ని తగ్గించుకున్న కేంద్రం

30 Sep, 2022 06:03 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని రూ.10,000 కోట్లు కుదించుకుంది. పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడం దీనికి కారణం. భారీ పన్ను వసూళ్ల వల్ల ఉచిత రేషన్‌ పంపిణీపై అదనపు వ్యయం రూ.44,762 కోట్లు భర్తీ అయ్యే పరిస్థితి నెలకొందని, ఇది కేంద్ర రుణ లక్ష్యాన్ని తగ్గించుకోడానికి సైతం దోహదపడిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ కూడా ఖజానాకు లాభం ఒనగూర్చనుందని వివరించింది.

2022–23 బడ్జెట్‌ రూ.14.31 లక్షల కోట్ల మార్కెట్‌ రుణ సమీకరణలను నిర్దేశించుకుంది. తాజా కేంద్ర నిర్ణయంతో  ఇది రూ.14.21 లక్షల కోట్లకు తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–మార్చి మధ్య రూ.5.92 లక్షల కోట్ల (రూ.14.21 లక్షల కోట్లలో రూ.41.7 శాతం) రుణ లక్ష్యాలను జరపాల్సి ఉంది. ఇందులో ఒక్క సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల ద్వారా రూ.16,000 కోట్ల సమీకరణలు జరపనుంది. కాగా, సెప్టెంబర్‌ 17 నాటికి 30 శాతం అధికంగా (2020–21తో పోల్చి) రూ.8.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు