కారు తయారీ దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్..!

10 Feb, 2022 20:52 IST|Sakshi

న్యూఢిల్లీ: కారులో ఫ్రంట్ ఫేసింగ్ ప్యాసింజర్లందరికీ మూడు పాయింట్ల సీటు బెల్ట్ అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆటో మొబైల్ తయారీ కంపెనీలకు సూచించింది. కారు వెనుక వరుసలో కూర్చొన్న మధ్య వ్యక్తికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘ఆటోమొబైల్ సేఫ్టీ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా’ సదస్సులో తెలిపారు. "కారులో ముందు వైపు ఉన్న ప్రయాణీకులందరికీ మూడు పాయింట్ల సీటు బెల్ట్ అందించాలనే నిబందనను ఆటోమేకర్లకు తప్పనిసరి చేయడానికి ఒక ఫైలుపై సంతకం చేశాను" అని రోడ్డు రవాణా & రహదారుల మంత్రి తెలిపారు.

ఇకపై కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం, దేశంలో ఉత్పత్తి చేసే చాలా కార్లలో వెనుక సీట్లలో రెండు మాత్రమే మూడు పాయింట్ సీటు బెల్ట్ కలిగి ఉన్నాయి. ముందు సీట్లలో కూర్చొనే వారికి మూడు పాయింట్ల సీట్ బెల్ట్ ప్రాముఖ్యత గురించి చెప్తూ ఇకపై తప్పనిసరి చేస్తున్నట్లు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. దేశంలో 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది మరణిస్తున్నారని గడ్కరీ తెలిపారు.

(చదవండి: రష్యాలో సెక్యూరిటీ గార్డు చేసిన పనిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్టు..!)

మరిన్ని వార్తలు