టెలికంలో 100 శాతం ఎఫ్‌డీఐలు

7 Oct, 2021 04:15 IST|Sakshi

బ్యాంక్‌ గ్యారంటీ 80 శాతం తగ్గింపు

నోటిఫై చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: టెలికం సేవల రంగంలో ఆటోమేటిక్‌ పద్ధతిలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మంగళవారం ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2020లో జారీ చేసిన ప్రెస్‌ నోట్‌ 3లోని నిబంధనలు దీనికి వర్తిస్తాయని పేర్కొంది. దీని ప్రకారం భారత్‌తో సరిహద్దులున్న దేశాల ఇన్వెస్టర్లు, లేదా అంతిమంగా ప్రయోజనాలు పొందే వారు సరిహద్దు దేశాలకు చెందినవారైతే మాత్రం దేశీయంగా టెలికంలో ఇన్వెస్ట్‌ చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా టెలికం రంగంలో 49 శాతం దాకా మాత్రమే ఎఫ్‌డీఐలకు ఆటోమేటిక్‌ విధానం అమలవుతోంది. అంతకు మించితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటోంది. సంక్షోభంలో చిక్కుకున్న టెల్కోలను గట్టెక్కించేందుకు ఇటీవల ప్రకటించిన ఉపశమన చర్యల్లో భాగంగా ఎఫ్‌డీఐల పరిమితిని కూడా కేంద్రం 100 శాతానికి పెంచింది.

మరోవైపు, టెల్కోలు సమరి్పంచాల్సిన పనితీరు, ఆర్థిక బ్యాంక్‌ గ్యారంటీ పరిమాణాన్ని 80 శాతం మేర తగ్గిస్తూ టెలికం శాఖ (డాట్‌) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లైసెన్సు నిబంధనల సవరణ నోట్‌ను జారీ చేసింది. దీని ప్రకారం టెల్కోలు తాము తీసుకునే లైసెన్సు కింద అందించే ప్రతి సర్వీసుకు రూ. 44 కోట్ల పెర్ఫార్మెన్స్‌ బ్యాంక్‌ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. పాత నిబంధన ప్రకారం ఇది రూ. 220 కోట్లుగా ఉండేది. అలాగే కొత్త నిబంధన ప్రకారం ప్రతి సర్కిల్‌కు గరిష్టంగా రూ. 8.8 కోట్ల ఫైనాన్షియల్‌ బ్యాంక్‌ గ్యారంటీ ఇస్తే సరిపోతుంది. గతంలో ఇది రూ. 44 కోట్లుగా ఉండేది. కోర్టు ఆదేశాలు లేదా వివాదానికి సంబంధించి ఇచ్చిన బ్యాంక్‌ గ్యారంటీలకు ఇది వర్తించదు. తాజా సవరణతో టెల్కోలకు ఊరట లభించనుంది. గ్యారంటీల కింద బ్యాంకులో తప్పనిసరిగా ఉంచే మొత్తంలో కొంత భాగం చేతికి అందడం వల్ల నిధులపరంగా కాస్త వెసులుబాటు ఉంటుంది.

మరిన్ని వార్తలు